26-10-2025 12:00:00 AM
అంతుచిక్కని రహస్యం ఛాయాసోమేశ్వరాలయం
అది.. నల్లగొండ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం. చుట్టూ పచ్చని పంట పొలాలు.. మధ్యలో 800 ఏండ్ల నాటి త్రికూటలాయం.. ఇక్కడ నిత్యం శివలింగంపై ఛాయ పడడంతో ఈ ఆలయం ఛాయా సోమేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఎన్నో అంతుచిక్కని రహస్యాలతో భారతీయ వాస్తు శాస్త్రం గొప్పతనానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఈ ఛాయ సోమేశ్వర ఆలయం గర్బగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా.. అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. వెలుతురు ఉన్నంతసేపు ఆ నీడ కదలకుండా ఒకే స్థానంలో నిశ్చలంగా ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత.
ఛాయసోమేశ్వరాలయంలోని గర్భగుడిలో శివలింగం వెనుక సూర్యుని కిరణాలతో సంబంధం లేకుండా లింగం ఆకారంలో నీడ దర్శనమిస్తుంది. ఇది ఎలా ప్రత్యక్షంగా కనిపిస్తుందనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఈ ఆలయం గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభా లున్నా.. అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. ఆలయానికి పడమర దిక్కున ఉన్న గర్బగుడిలో ఉన్న శివలింగం మీదుగా ఈ నీడ కనిపిస్తుంది. ఈ నీడ వెలుతురు ఉ న్నంత సేపు ఒకే చోట స్థిరంగా ఉంటుంది.
సూర్యుడి గమనం మారినా ఆ నీడలో ఎలాంటి మార్పు రాదు. సాధారణంగా ‘నీడ’ అనేది వెలుతురుకు వ్యతిరేకంగా పడుతుంది. కానీ, ఈ నీడ సూర్యుడి వెలుతురుతో పనిలేకుండా ఒకే చోట స్థిరంగా కనిపించడం ఎవరికీ అంతు చిక్కని రహస్యం.
ఈ ఆలయంలో మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఆ నీడ ఏ వస్తువుదనే విషయం ఇప్పటికీ అంతు చిక్కలేదు. ఆలయంలోని రెండు స్తంభాల్లో ఒకదాని నీడై ఉండొచ్చని భావించినా, ఒకే నీడ రెండు స్తంభాలకు మధ్యలో ఉండే గర్భగుడిలోని విగ్రహం వెనుక వైపు పడుతోంది. దీంతో ఈ నీడ దేనికి చెందింది అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది.
800 ఏండ్ల క్రితం ఆలయ నిర్మాణం
పానగల్ ఛాయాసోమేశ్వరాలయాన్ని దాదాపు 800 ఏండ్ల క్రితం కుందూరు చాళుక్య ప్రభువైన ఉదయ భానుడనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయం త్రికూటాలయంగా మూడు గర్బాలయాలతో ప్రసిద్ధి పొందింది. ఛాయా సోమేశ్వరాలయాన్ని త్రికూటాలయం అని కూడా అంటారు. ఆ ఆలయంలోని మూడు గర్బ గుడులు కూడా ఒకేరీతిగా ఉంటాయి. అయితే, పడమటి గర్భగుడిలో మాత్రమే ఈ నీడ కనిపిస్తుంది.
భక్తులంతా ఇది దేవుడి మాయ అని నమ్ముతారు. ఈ ఆలయ శిల్పి.. గర్భగుడిలో పడే నీడకు.. సూర్యుడి కాంతితో పనిలేకుండా పగటి వేళల్లో వెలుతురు మా త్రమే ఉపయోగపడేలా ఆలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు. అయితే, ఈ నీడ ఎలా ఏర్పడుతుందనేది ఇప్పటికీ మిస్టరీనే.
ఆవరణలో మూడు ఆలయాలు
ఈ ఆలయం ఆవరణలో సూర్యుడు, విష్ణువు. శివుడి ఆలయాలు ఉంటాయి. మూడు గర్భాలయాలు ఒకేచోట ఉన్నందున దీన్ని ’త్రికూటాలయం’ అని కూడా పిలుస్తారు. తూర్పున సూర్యదేవాలయం, పడమర దిక్కున శివాలయం, ఉత్తరాన విష్ణు ఆలయం ఉంటుంది. ఇక్కడి శివలింగాన్ని ’జల లింగం’ అని పిలుస్తారు. ఇక్కడి కోనేరులో ఏడాదంతా నీళ్లు ఉంటాయి. గద, శంఖుచక్రాలు చెక్కిన గోడలు, దేవనాగరి లిపిలో ఉన్న శాసనాల్ని చూడొచ్చు.
పిల్లర్స్ మీద రామాయణ, మహాభారత ఉదంతాల శిల్పాలు చెక్కారు. మరోవైపు సూర్య భగవానుడి ధర్మపత్ని, శనీశ్వరుడి తల్లి ఛాయ అమ్మవారి విగ్రహాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడ ఛాయారూపంలో అమ్మవారు దర్శనం ఇస్తారంట. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేసిన స్వామివారి అనుగ్రహం పొందొచ్చు.
బాదిని నర్సింహ,
నల్లగొండ, విజయక్రాంతి