calender_icon.png 30 October, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్తీక నిష్ఠ.. సకల సిద్ధిరస్తు!

26-10-2025 12:00:00 AM

భక్తి.. పారవశ్యం.. ప్రకృతి.. ఆరోగ్య ఉషస్సు..

‘భారతీయ సంప్రదాయంలో మాసాలన్నింటిలో కార్తీక మాసానికి విశిష్ఠ ప్రత్యేకత ఉంది. అంతేకాదు, పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసంగా భక్తులు కొలుస్తారు. ఈ మాసం మొత్తం నిష్ఠగా పూజిస్తే సకలం సిద్ధిస్తుందని నమ్ముతుంటారు. ప్రజలు భక్తిపారవశ్యంలో మునగడమే కాదు.. ప్రకృతి ఒడిలో ఆరాధిస్తూ.. జీవిస్తూ. ఆడుతూ.. పాడుతూ.. ఆస్వాదిస్తూ.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతుంటారు. అంతేకాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని కొందరు వైద్యులు, మానసికనిపుణులు చెబుతున్నారు. కార్తీక మాసం విశేషాలు.. కలిగే ప్రయోజనాల గురించి ‘విజయక్రాంతిప్రత్యేక కథనం..” 

భారతీయ సంప్రదాయం ప్రకారం మాసాలన్నింటిలో కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉందని చెప్తారు. ప్రతి ఏడాది దీపావళి వెళ్లిన మరుసటిరోజు కార్తీక మాసం మొదలై నెల రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కార్తీక మాసంలో తెలుగు రాష్ట్రాలలో శివాలయాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. భక్తితో పాటు ఆరోగ్యానికి అనుకూల మాసంగా చెప్పుకుంటారు. ఉపవాసాలు, దీక్షలు శాకాహారభోజనాలు, పండ్లు ఫలాలు, ఆకుకూరలు, కూరగాయలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.

ప్రకృతిశ్వాస, చలిస్నానాలు దృఢశక్తిని ఉత్తేజనిస్తాయి. ఆరోగ్యం, అనుబంధాలకు, అనురాగాలకు, ఆప్యాయతకు అండగా నిలుస్తుంది. కుల, మత వర్గ ప్రాంతాల ఐక్యతను చాటి చెబుతుంది. ప్రేమానురాగాలను, ఒకరిని మరొకరిని గౌరవించుకోవడం నేర్పుతుంది. ప్రకృతిని పల్లెలను పట్టణాలను భూమి, గాలి, నీరును ఒకటిని చేస్తుంది. అందుకే కార్తీక మాసం భక్తి పరవశం కలయికగా ప్రత్యేకతను చాటుకుంటుంది

దీపారాధన 

దీపారాధనకు చాలా విశిష్టత ఉంది. ఒక్క రోజు దీపం వెలిగిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. దీపం వెలిగించడంలో శాస్త్రీయత ఉన్నది. నువ్వుల నూనె, నెయ్యితో పెట్టిన దీపం నుంచి వచ్చిన పొగను పీల్చడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆజ్ఞాన చీకట్లను తొలగించి, జ్ఞాన వెలుగులు నింపుకోవాలన్నదే దీపం ప్రత్యేకత.

శివాలయాలకు భక్తుల తాకిడి 

కార్తీకమాసం పరమశివుడికి ప్రీతి మాసం కావడంతో తెలుగు, ఇతర రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన శ్రీశైలం మల్లన్న స్వామి,  అరుణాచలం, చెర్వుగట్టు రామలింగాలస్వామి, వేములవాడ, మేళ్లచెర్వు వాడపల్లి, ఛాయా సోమేశ్వర దేవాలయం, పిల్లలమర్రి శివాలాయంతోపాటు శివాలయాలు, దేవస్థానాలు భక్తులతో పోటెత్తుతున్నాయి.

చలి స్నానం.. ఆరోగ్యానికి ప్రయోజనం

చలికాలం వచ్చిందంటే.. కార్తీక మాసం వచ్చినట్టే. ప్రజలు, భక్తులు, మాలలు ధరించిన వారు చలిస్నానాలు చేయడం ఆనవాయితీ. స్నానాల్లో, పూజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నెల వచ్చిందంటే చాలా మంది నాన్ వెజ్ తినడం మానేసి.. పూజలు చేస్తుంటారు. హిందూ పండుగల్లో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉంటాయి. సాధారణంగా చలికి ఉదయం త్వరగా లేవలేం. బద్ధకంగా ఉండి.. ఏ పని కూడా చేయాలనిపించదు.

అందుకే కార్తీక మాసంలో వేకువ జామునే లేచి స్నానాలు చేయడం వల్ల బద్ధకం వదిలి.. కొత్త ఉత్తేజం వస్తుంది. అంతేకాదు పనులు కూడా త్వరగా పూర్తి అవుతాయి. తొందరగా నిద్ర లేవడం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చు. పైగా నదీ జలాల్లో స్నానం చేయడం వల్ల.. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దూరమై మానసిక ఆహ్లాదం నెలకొంటుంది.

నదిలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది కదా.. ఆ తాజా నీటిలో స్నానం చేస్తే శరీర కండరాలన్నీ చలిని తట్టుకోవడానికి సిద్ధం అయిపోతాయి. భక్త జనకోటి చేసే నదీ స్నానాల్లో ఆధ్యాత్మికత తో పాటు శాస్త్రీయత ముడిపడి ఉంది. కొత్త ఉత్తేజితంగా మారుతుందని పెద్దలు చెబుతూంటారు.

మాంసాహారానకి దూరం ఉపవాస దీక్షలు.. 

కార్తీక మాసంలో భక్తులు మాంసాహారానికి దూరంగా ఉంటారు. ప్రతి సోమవారం భక్తులు ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఉదయాన్నే దేవునికి దీపం వెలిగించి ప్రారంభించే ఉపవాసం సాయంత్రం నక్షత్ర దర్శనం వరకూ కొనసాగిస్తారు. తరువాత ఫలహారంతో ఉపవాసాన్ని విరమిస్తారు. కనీసం వారానికి ఒకసారైనా ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం మన జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుందని ఆధునిక ప్రపంచంలో డాక్టర్లు చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనా లెన్నో ఇమిడి ఉన్నాయని పేర్కొంటున్నారు.

అయ్యప్ప దీక్షలు, ఐక్యతకు వేదికలు 

కార్తీక మాసం అనగానే గుర్తొచ్చేవి.. అయ్యప్పదీక్షలు, శివ మాలలు, ఇతర మాలలు. కార్తీక మాసం నుంచి, మకర సంక్రాంతి వరకూ అయ్యప్ప స్వామి, శివ, ఇతర భక్తులు మాల ధారణ చేస్తారు. 41 రోజుల పాటు కఠినమైన నిష్ఠతో దీక్షను కొనసాగిస్తారు. ఈ మాలలు కుల మత, ప్రాంతాలకతీతంగా, ఆర్థికపరమైన వ్యత్యాసాలు లేకుండా ప్రజల మధ్య ఐక్యతను చాటిచెబుతాయి. ఆప్యాయతలకు అనురాగాలకు వేదికలవుతాయి. భక్తితో పాటు సేవా, స్నేహభావాన్ని, గౌరవాన్ని పెంపొందిస్తాయి.

వనభోజనాలు..

కార్తీకమాసంలో వనభోజనాలు మరో ప్రధానమైన ఆచారం. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఈ మాసంలో పౌర్ణమి రోజు వనభోజనాలు చేస్తారు. ఉసిరి చెట్టు లేని ఎడల పచ్చని చెట్ల కిందే భోజనం చేస్తారు. ఎందుకంటే..! చెట్ల చల్లని నీడ, కలుషితం లేని గాలి,  పచ్చని ప్రకృతి ఆరోగ్యానికి మంచిది. పచ్చని ఆకులో భోజనం చేయడం సంప్రదాయం.

ఆరోగ్యానికి మంచిది.. వనభోజనాల వల్ల కుటుంబానికి మేలు జరుగుతుందని కూడా అంటారు. మానవుడు సంఘజీవి కాబట్టి ఇలాంటి సామూహిక కార్యక్రమాలు మానసిక, భౌతిక జీవితానికి ఉపయోగపడతాయి. సంతోషాన్నికలిగిస్తాయి. ఇక బంధువులు, స్నేహితులతో కలిసి వనభోజనాలకు వెళ్లడం వల్ల మనుషుల మధ్య ఆత్మీయతలు, అనురాగాలు, అభిమానాలు, పెరుగుతాయి.

గడగోజు రవీంద్రాచారి,

నకిరేకల్ (విజయ క్రాంతి)