26-10-2025 12:00:00 AM
హనుమకొండలో అరుదైన పశ్చిమ ద్వార శివాలయం
వివిధ అలంకార రూపాల్లో భక్తులకు దర్శన భాగ్యం
చరిత్ర, వాస్తు శిల్పం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా వరంగ ల్ జిల్లా హనుమకొండలో కొలువైన స్వయంభు సిద్ధేశ్వర స్వామి దేవాలయం విలసిల్లుతోంది. చాళుక్యుల కాలంలో నిర్మించినట్లు చెబుతున్న ఈ ఆలయం పశ్చిమ ముఖ ద్వారాన్ని కలిగి ఉండి భారతదేశంలో అరుదైన దేవాలయా ల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వానికి ఈ దేవాలయం గొప్ప సాక్ష్యంగా నిలుస్తోంది.
స్థల పురాణం
సందీల్య మహర్షి తీవ్రమైన తపస్సు చేసిన తర్వాత శివుడు స్వ యంభు లింగంగా సిద్ధేశ్వర స్వామి గా ప్రత్యక్షమయ్యాడని భక్తులు విశ్వసిస్తున్నారు. కాకతీయుల కా లంలో రాజులు ఈ ఆలయంలో పూజలు చేసేవారని, రాత్రి సమయంలో నాగేంద్రుడు లింగాన్ని కాపాడుకునేదని నమ్మిక. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ చంద్ర శేఖర సరస్వతి స్వామీజీ ఈ ఆలయం మహిమను విశ్వవ్యాప్తం చేశారు. సిద్ధేశ్వరుడిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతా యని భక్తుల విశ్వాసం.
ప్రత్యేకంగా వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ముందుగా సిద్ధేశ్వరుడి ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ నందికేశ్వర పుష్కరిణి (గుండం) అత్యంత ప్రా ముఖ్యత కలిగింది. చాళుక్య శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం వాస్తు శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. గోడలు, స్తంభాలపై మహాభారతం రామాయణం, భా గవత పురాణాల దృశ్యాలు చెక్కబడ్డాయి.
సంవత్సర కాలంలో మూ డు రోజులపాటు సూర్యకిరణాలు నేరుగా సిద్ధేశ్వరుడి పై పడడం మహిమాన్వితంగా చెబుతారు. ప్రతి ఏటా మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా, కనులపండువగా నిర్వహిస్తారు. ఆ సమయంలో సిద్ధేశ్వరుడిని వివిధ రూపాల్లో కొలుస్తారు. ప్రతి సోమవారం లింగార్చన, రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ప్రశాంతమైన దైవిక వాతావరణంతో సిద్ధేశ్వర స్వామి దేవాలయం అనునిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది.
హనుమకొండ పట్టణంలో కొలువున్న సిద్ధేశ్వరుడి దేవాలయానికి దేశంలోని నలుమూలల నుంచి వస్తుంటారు. విమానంలో వచ్చేవారు హైదరాబాదుకు చేరుకొని రైలు, బస్సు మార్గాల ద్వారా వరంగల్, కాజీపేటకు చేరుకొని అక్కడ నుంచి హనుమకొండలోని దేవాలయానికి చేరుకోవచ్చు.
బండి సంపత్ కుమార్,
మహబూబాబాద్, విజయక్రాంతి