02-01-2026 02:36:23 PM
* రామాయంపేట ఆసుపత్రిలో డాక్టర్ల కొరత
* స్వీపర్లతో కుట్లు వేయించిన వైనం
రామాయంపేట: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందాలన్న ప్రభుత్వ లక్ష్యం కాగితాలకే పరిమితమవుతోందని మరోసారి రుజువైంది. మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న డాక్టర్ల కొరత రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వైద్యం అందాల్సిన చోట నిర్లక్ష్యం రాజ్యమేలుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతిరోజూ కనీసం నలుగురు డాక్టర్లు విధుల్లో ఉండాల్సి ఉండగా ఆసుపత్రిలో కేవలం ఒక్క డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉండటం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.
ఫలితంగా రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుండగా అత్యవసర చికిత్సలు సైతం అందక అవస్థలు పడుతున్నారు. ఈ నిర్లక్ష్యానికి పరాకాష్టగా గురువారం జరిగిన ఆటో బోల్తా ఘటన నిలిచింది. ప్రమాదంలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా ఆసుపత్రిలో అప్పటికప్పుడు వైద్యుడు లేకపోవడంతో స్వీపర్లు, అటెండర్లు కుట్లు వేయించాల్సిన దుస్థితి నెలకొంది.
వైద్య అర్హతలేని సిబ్బందితో చికిత్స చేయించడం రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు వ్యవస్థాగత వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం అని స్థానికులు మండిపడుతున్నారు. జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయి డాక్టర్ల నియామకం పెంచి
అవసరమైన వైద్య సిబ్బందినీ భర్తీ చేసి
24 గంటల అత్యవసర సేవలు అందుబాటులోకి తేవాలని రామాయంపేట ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో మరో ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది అనే ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.