11-10-2025 12:00:00 AM
శేరిలింగంపల్లి, అక్టోబర్ 10 (విజయక్రాంతి): మాదాపూర్, కూకట్‌పల్లిలోని తమ్మిడి కుంట, నల్ల చెరువుల అభివృద్ధి పనులను నవంబర్ నాటికి పూర్తి కావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆ రెండు చెరువుల అభివృద్ధ్ధి పనులు జరుగుతున్న తీరును క్షేత్ర స్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు చెరువులు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందాలని సూచించారు.
శిల్పారామం, మెటల్ చార్మినార్ వైపుల నుంచి వచ్చే ఇన్లెట్ల అభివృద్ధిలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. చెరువు చుట్టూ బండ్ బయటవైపు రిటైనింగ్ వాల్ నిర్మించాలని.. చెరువు లోపలి వైపు రాతి కట్టడం పటిష్టంగా ఉండాలన్నారు.14 ఎకరాల చెరువును 29 ఎకరాలకు విస్తరించడం జరిగిందని.. అదే విస్తీర్ణంలో నీరు నిలిచేలా చెరువు అభివృద్ధి చేయాలని సూచించారు.
చెరువు చుట్టూ దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఉన్న పాత్వేలో ప్రాణ (ఆక్సిజన్) వాయువు అందించడంతో పాటు,చల్లటి నీడనిచ్చే చెట్లు పెంచాలన్నారు. భవిష్యత్‌లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తమ్మిడికుంట చెంత కనీసం 3 నుంచి 4 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గేలా చూడాలని అధికారులను ఆదేశించారు.