calender_icon.png 11 October, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌ను మోదీకి కానుకగా ఇవ్వాలి

11-10-2025 12:00:00 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు 

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సీటు గెలిచి ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇవ్వాలని పార్టీ ముఖ్య నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సూచించారు. శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్‌లోని బీజేపీ ముఖ్య నాయకులతో నిర్వహించిన కీలక స మావేశంలో ఆయన మాట్లాడారు. రెండుమూడు రోజుల్లో పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా, సమన్వయం తో పనిచేసి  విజయానికి కృషిచేయాలని ఆయన సూచించారు.

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి, బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  రానున్న లోకల్ బాడీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ నగరాన్ని వరల్డ్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పి.. విషాదనగరంగా మార్చారని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని కనుమరుగు చేసిందని విమర్శించారు. . కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని, ప్రధాన మార్గాలు, డ్రెయినేజీ వ్యవస్థలు, రోడ్ల నిర్వహణపై నిర్లక్ష్యం చేస్తోందని, ఇటీవల తెరిచిన మ్యాన్‌హోల్ ప్రమాదాలతో పిల్లలు మృతిచెందిన ఘటనలు చూశామ న్నారు. కేవలం ఓటుబ్యాంకు రాజకీయాల కోసం మజ్లీస్‌తో కలిసేందుకు రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ప్రకటనలు చేస్తూనే మరోవైపు బస్సు చార్జీలు పెంచ డం దారుణమన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు లేదని, మజ్ల్లీస్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందాలను ఎండగట్టాలన్నారు. 

మధుకర్ మృతిపై విచారణ జరపాలి

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్ అనుమానాస్పద మృతి పై విచారణ జరపాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ఆయన మృతిపై రాంచందర్‌రావు విచారం వ్యక్తం చేశారు. మధుకర్ ధైర్యంగా, సమర్థంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని, ప్రజా సమస్యలు పరిష్కరించేలా సేవలందించారని తెలిపారు.

అయితే, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ అక్కసుతో మధుకర్‌పై అక్రమ కేసులు బనాయించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడని, పోలీసులు అక్రమంగా అట్రాసిటీ కేసు నమోదు చేసి తీవ్రంగా వేధింపులకు గురిచేయడంతో మధుకర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారన్నారు. మధుకర్‌ది హత్య లేదా ఆత్మహత్యనా అనే దానిపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కోరారు.