calender_icon.png 28 January, 2026 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవిత సంఘర్షణల లెక్క ‘సిక్కా’

19-01-2026 12:00:00 AM

తెలుగు సాహిత్య రంగంలో కథకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీఊహ. ఆమె ఇప్పటికే ఇసుక అద్దం (2022), బల్కావ్ కథలు (౨౦౨౪) పేరిట రెండు కథల పుస్తకాలను వెలువరించారు. ముచ్చటగా ఆమె మూడో కథల పుస్తకం ‘సిక్కా’. మొత్తం ౧౧ కథలతో ౧౧ రకాల భావోద్వేగాలను, మనుషుల్లోని అంతః సంఘర్షణను తనదైన శైలి, శిల్పంతో రచయిత్రి ఆవిష్కరించారు. క్లిష్టమైన పద ప్రయోగాలు లేకుండా, సామాన్యుడికి అర్థమయ్యేలా రాస్తూనే, మనసుకు హత్తుకునేలా రాయడం ఆమె ప్రత్యేకత.

కథా గమనంలో వచ్చే సంభాషణలు చాలా సహజంగా ఉండి, పాఠకుడిని ఆయా పాత్రలతో మమేకం చేస్తాయి. అట్టడుగు జీవితాల్లోని పదజాలం, ప్రాంతీయ మాండలికపు స్పర్శ ఈ కథలకు అదనపు బలాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా నిరుపేదలు, మైనార్టీవర్గాలు, స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి కల్లోలిత మనసుల్లోని భావనలను శ్రీఊహ తన కథల ద్వారా చెప్పాలనుకున్నారు.

ప్రతి మనిషికి ఆత్మ గౌరవం అవసరమని, బాహ్య వస్తువులు, పొగడ్తలతో వచ్చే సంతృప్తి కంటే ఆత్మసంతృప్తి ముఖ్యమని ఆమె రచనలు మనకు పరోక్షంగా ఉద్బోధిస్తాయి. నిరుపేదల జీవితాల్లోని చిన్న చిన్న ఆనందాలు, అవి దూరమైతే కలిగే బాధలు, అట్టడుగు వర్గాలు నిత్యజీవితంలో ఎదుర్కొనే సామాజిక వివక్షను కళ్లకు కట్టినట్లు ఆమె కథలు వివరిస్తాయి. మొదటి కథ ‘మహోన్నతుడు’ పశువుల కళేబరాల నుంచి ఎముకలు సేకరించి ఫ్యాక్టరీలకు అమ్మి బతికే బైసాకు, హడ్డి అనే అన్నదమ్ముల దయనీయ జీవన చిత్రాన్ని రచయిత్రి ఆవిష్కరించారు.

జీతం లేని పారిశుద్ధ్య కార్మికులుగా ఊరిని శుభ్రం చేస్తున్నా, వారికి కనీస గౌరవం దక్కకకపోవడం, పైగా వారు నిత్యం దాడులు, దూషణలకు గురయ్యే విషాదాన్ని కథ ద్వారా అక్షరీకరించారు. రెండో కథ ‘అత్తరు’ కథ భార్యాభర్తల మధ్య ఉండే అపురూపమైన అనురాగాన్ని, జ్ఞాపకాల పరిమళాన్ని అత్యంత సున్నితంగా స్పృశించింది. హుస్సేన్ అనే వ్యక్తి తన భార్య జైనబ్ మరణం తర్వాత ఆమె గతంలో వాడిన అత్తరు సువాసన కోసం పరితపిస్తాడు. అత్తరులో ఆమె ఉనికిని భర్త వెతుక్కోవడం పాఠకుడి హృదయాలను హత్తుకుంటుంది.

కేవలం వంటలకే పరిమితం కాకుండా భర్త వ్యాపారాన్ని ఆధునీకరించడంలో తన భార్య చూపిన చైతన్యం ఆమె వ్యక్తిత్వంలోని గొప్పతనాన్ని చాటిచెబుతుంది. రచయిత్రి ఈ కథ ద్వారా ప్రేమంటే కేవలం వ్యక్తుల మధ్య ఉండేది మాత్రమే కాదని, అది సుగంధ పరిమళంలా మనిషి జీవితాంతం వెన్నంటే ఉందని ఊరటనిస్తుందని బలంగా చెప్పారు. ఇక పుస్తకం పేరైన ‘సిక్కా’ కథ ఓ ముస్లిం కుటుంబం తరతరాల నుంచి చేస్తూ వస్తున్న వృత్తిపై చర్చిస్తుంది. తరాలు మారినా, వారి బతుకులు ఎందుకు మారడం లేదు.

తర్వాతి తరం కూడా అనివార్యమైన పరిస్థితుల్లోనో, యాదృచ్ఛికంగానో అదే వృత్తిని ఎంచుకోవడమనే అంశాన్ని లోతుగా విశ్లేషిస్తుంది. ‘షిఫ్ట్ డిలీట్’ కథలో ఒక అమ్మాయి తన ప్రేమికుడి నుంచి ఆధిపత్యపరమైన వేధింపులు ఎదుర్కొంటుంది. స్వచ్ఛమైన ప్రేమ కోసం పరితపించిన అమ్మాయికి ప్రతిక్షణం తనను దూషించే, అనుమానించే, తన చెప్పు చేతల్లో అణిగి మణిగి ఉండాలనే అబ్బాయి దొరికితే.. ఆ బంధంలో అనుభవించే క్షోభను రచయిత్రి ప్రాక్టికల్‌గా వివరించారు. కథాంతంలో అమ్మాయి ఏం నిర్ణయం తీసుకున్నది.. అనే అంశాన్ని స్ఫూర్తిదాయకంగా మలిచారు.

‘పడ్డ మార్గం’ కథ.. ఎదుటి వారి ప్రశంసలు కంటే, మనం చేసే పనిలో ఆత్మసంతృప్తి వెతుక్కోవాలని, మనం చేసే పని మనకు సంతోషాన్నివ్వాలే.. కానీ, ఎదుటివారి మెప్పు కోసం కాదనే సందేశమిస్తుంది. అలాగే ‘బ్యాంకు బర్త్ డే’, ‘గాజు కన్ను బోడి బెంచి’, ‘ప్రెస్ అంకుల్‌ె పద్మిని ప్రీమియర్’, ‘గెలుపు తలుపు’ వంటి కథలు వేతన జీవుల ఒత్తిళ్లు, కుటుంబ బాగోగులు చూసుకోలేని దైన్యం, కౌమార దశ పిల్లల్లో కలిగించే ప్రకంపనలు, వాటి పర్యావసానాలు.. తదితర అంశాలను చర్చిస్తాయి. సమాజంలో అణచివేతకు గురైన వారి ఆవేదనను వ్యక్తీకరిస్తాయి. మొత్తానికి ‘సిక్కా’ కథల సంకలనం పీడితులు, బాధితుల గొంతుక!

       ప్రతులకు: బీట్రూట్ బుక్స్, హైదరాబాద్, ఫోన్: ౯౩౮౧౧ ౧౦౯౭౯