calender_icon.png 28 January, 2026 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమర్శకు గీటురాయి ‘విభాత సంధ్య’

19-01-2026 12:00:00 AM

‘సాహిత్య అధ్యయనం సామాజిక శాస్త్రవేత్తలకు తమ పరిశోధనలో కోల్పోయిన సమగ్రతను కల్పించగలదు’ అన్నారు బాలగోపాల్. సరిగ్గా 40 ఏళ్ల కింద ‘విభాత సంధ్యలు’ సమీక్షిస్తూ అన్న మాటలు అవి. 1980ల మధ్యకాలంలో నాబోటి సాహిత్య విద్యార్థులకు ‘విభాత సంధ్యలు’ గొప్ప ప్రేరణ. సాహిత్య అధ్యయనానికి అది కొత్త దారులు చూపింది. విమర్శని ఒక శాస్త్రంగా అధ్యయనం చేయడానికి అవసరమైన చూపుని అందించింది.

సమా జానికీ, సాహిత్యానికీ విడదీయరాని సంబంధం గురించి లోతెన అవగాహన కలిగించింది. అకడమిక్ రంగంలో కృషి చేసే సమాజిక అధ్యయనకారుల్ని సాహిత్యంలోకి, సాహిత్యకారుల్ని సామాజికశాస్త్రాల వైపు దృష్టి సారించేలా చేసింది. కాలక్షేప వ్యాపార సాహిత్యంలో కూరుకుపోయిన పాఠకులకు సీరియస్ సాహిత్యంపై ఆసక్తిని రేకెత్తించింది. సామాజిక శాస్త్రవేత్తలకు యేమో గానీ సాహిత్య విమర్శకులకు, సాహిత్య  అధ్యయనానికి ‘విభాత సంధ్యలు’ కొత్త మెథడాలజీని ఇచ్చింది. ఆ యిద్దరి మధ్యా అనివార్యమైన వారధి నిర్మించింది. విమర్శకు శాస్త్రీయతని సాధించి సాహి త్య ప్రయోజనాన్ని పునర్నిర్వచించింది. 

సాహిత్యంలో సామాజికత, సాహిత్యానికి సామాజిక ప్రయోజనం అనే మాటలు ఇవాళ కొంతమందికి అర్థరహితంగా కనిపిస్తున్నాయి. కాలం చెల్లినవిగా అనిపిస్తున్నాయి. సాహిత్యాన్ని సమాజంతో ముడిపెట్టి చూడటాన్ని సాహిత్యంలోకి రాజకీయాల్ని చొప్పించడంగా భావించేవారి సంఖ్యకైతే కొదువలేదు. చదువ రుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మౌలిక భావనలతో కూడిన విమర్శకు చోటులేకుండా పోయింది.

దృక్పథ రాహిత్యమే రాజ్యమేలుతున్నది. అనిబద్ధతే జబ్బలు చరుచుకొంటున్నది. అసలు అధ్యయనమే కొందరికి పనికిమాలినదిగా మారింది. సమాజం రచయితల్లో పాఠకుల్లో విమర్శనాత్మక దృష్టిని కోరుకుం టున్న వర్తమాన సందర్భంలో సాహిత్య విమర్శను సామాజిక శాస్త్రాల అధ్యయనంతో సంపాదకుడు సీవీ సుబ్బారావు (సురా) అనుసంధానించిన ‘విభాత సంధ్యలు’ అనే చిన్న పొత్తం 40 సంవత్సరాల తర్వాత పునః ముద్రణ పొందుతున్నది. 

‘విభాత సంధ్యలు’ సామాజిక శాస్త్రాలను సాహిత్యానికి అన్వయించే ఒక మెథడాలజీని అందజే సినప్పటికీ ఈ 40 ఏళ్లలో సాహిత్యం విమర్శను శాస్త్రంగా అభివృద్ధి పరచుకోగలిగామా? సాహిత్య విమర్శ శాస్త్రమైతే దాని అధ్యయన పద్ధతులేవి? అవి మౌలికంగా యితర సామాజిక శాస్త్రాల అధ్యయనం కంటే భిన్నంగా వుంటాయా? ఆ దిశలో కొత్తగా సైద్ధాంతిక పరిభాషను సమకూర్చుకోగలిగామా? సమాజ సాహిత్యాల పరిశోధనలో పునాది వుపరితలం వంటి మౌలిక భావనల దగ్గర నుంచి విసృ్తతం కాగలిగామా?

సామాజిక శాస్త్రాలు వాటి అధ్యయన పద్ధతులు పరస్పరం పూరకాలుగా ఉన్నాయా? సాహిత్య విమర్శలోకి వాటిని అనువర్తనం చేసుకోగలిగామా? ఇలాంటి ప్రశ్నలెన్నో ఈ పుస్తకంలోని వ్యాసాలు మరోసారి చదువుతున్నప్పుడు ఉత్పన్నమవుతాయి. నిజానికి ‘విభాత సంధ్య’ల్లో సమాజంలో అణగారిన అన్ని సెక్షన్లకూ ప్రాతినిధ్యం లభించలేదు. ఇప్పుడు దానికి కూడా సమాధానం అన్వేషించాలి. భిన్న శిబిరాల్లో భిన్న దృక్పథాలకు చెందిన విమర్శకులకు రచయితలకు సామాజిక శక్తులకు మధ్య వ్యక్తమయ్యే వైరుధ్యాలను పరిష్కరించుకోడానికి అవసరమైన స్పష్టమైన సమన్వయ వైఖరి ఉన్నప్పుడే వాటికి సమాధానాలు లభిస్తాయి. 

‘కొమురం భీం’ నవలను పరామర్శిస్తూ ఈ పుస్తకంలో ‘సురా’ రాసిన వ్యాసం, కొడవటిగంటి కుటుం బరావు (కొ.కు) ‘చదువు’ నవలపై హరగోపాల్ చేసిన విశ్లేషణ అందుకు మంచి వుదాహరణలుగా నిలుస్తాయి. అలాగే సిద్ధాంత పరిజ్ఞానానికి పరిమతమయ్యే అధ్యయనం వల్ల ప్రయోజనం ఉండదనీ దాన్ని జీవితానుభవాల గీటురాయి మీద పరీక్షించుకొన్నప్పుడే సత్యాన్ని నిర్ధారించుకోగలమనీ కేశవరెడ్డి నవలపై డీఎన్ వ్యాసం నిరూపిస్తుంది.

తమది కాని జీవితానుభవాన్ని సృజనాత్మకంగా చెప్పడంలో యేర్పడే పరిమితుల్ని అధిగమించడానికి  రచయితలు, దాన్ని వ్యాఖ్యానించే సామాజికవేత్తలు అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి వస్తుందనడానికి దృష్టాం తంగా గరికపాటి నిరంజనరావు ‘యజ్ఞం’ కథపై చేసిన పరిశీలనను చూడొచ్చు. అదే విధంగా సామాజిక అభివృద్ధి క్రమంలో యేర్పడే సమస్త వైరుధ్యాలకు, అమానవీయ చర్యలకు పాలకులు, ప్రభుత్వ యంత్రాంగాల వర్గ స్వభావం కారణమవుతుందని ‘కన్యాశుల్కం’పై ఆర్.ఎస్.రావు, రావిశాస్త్రి రచనలపై వీఎస్ ప్రసాద్ చేసిన పరామర్శలు ధ్రువీకరించాయి. 

సమాజం చీకటి కాలంలోకి జారుకుంటున్న ప్రతి సందర్భంలోనూ ప్రకాశవంతమైన మార్గం చూపగలిగేది సాహిత్యం మాత్రమే. ఫాసిస్టు పాలనలో సమా జం  వాటి మధ్య సంబంధం వంటి అవగాహనలన్నీ ప్రాసంగిత కోల్పోతున్నాయి. సాహిత్యం లో స్వేచ్ఛా, సమత్వం వంటి భావనలు, వ్యక్తీకరణలు ఆంక్షలకు గురవుతున్నాయి. బుద్ధిజీవుల ఆలోచనలపై నిఘా అమలవుతున్నది.

పుస్తకాలు నిషిద్ధమవుతున్నాయి. దశాబ్దాలుగా స్త్రీలు, దళితులు, కార్మికులు, మైనారిటీలు, ఆదివాసీలు పోరాడి సాధించుకున్న స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు హక్కుల్ని రాత్రికి రాత్రి చట్టబద్ధంగా మాయం చేసే మూకస్వామ్యం రాజ్యమేలు తున్నది. సృజన, విమర్శన వ్యాసంగాలు ప్రకటిత, అప్రకటిత సెన్సారింగ్‌ని ఎదుర్కొంటున్న సంక్లిష్ట సందర్భంలో శకలీకరణకు గురైన బాధిత అస్తిత్వ స మూహాలన్నీ ఒకటి కావాల్సి ఉంది.

అందుకు అవసరమైన ఉమ్మడి వేదికలు నిర్మించుకోవాలి. స్వీయ అస్తి త్వాలను కాపాడుకుంటూనే ఐక్య సంఘటన కట్టాలి. భిన్నాభిప్రాయం కలిగి ఉండటమే నేరంగా పరిణమించిన నేలపై ప్రజాస్వామిక భావనలు బలపడటానికి దోహదం చేసే సాహిత్య సృజన జరగాలి. సామూహిక సృజన ఒక్కటే జాతీయవాదం పేరుతో మతతత్వ ఫాసిస్టులు పెంచి పోషించే విద్వేష రాజకీయాలకు సమాధానం కాగలదు. బహుళత్వమే ఈ దేశ ప్రజల బలం. దాన్ని కాపాడుకునే దారిలో సాహిత్యకారులకు సరైన దిగ్దర్శనం చేయడానికి ‘విభాత సంధ్యలు’ వంటి మరో ప్రయత్నం ఇప్పుడు ఎంతెనా అవసరం. 

ప్రతులకు: ప్రచ్ఛాయ పబ్లికేషన్స్, ౭౦౯౩౧ ౬౫౧౫౧ లేదా chaayabook.com