07-01-2026 12:48:06 AM
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్, జనవరి 6 (విజయ క్రాంతి): దేశ భవిష్యత్తును నిర్మించే మౌన కర్మాగారం సరస్వతి శిశు మందిర్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ లోని హౌజింగ్ బోర్డు కాలనీలోని సరస్వతి శిశు మందిర్ లో రెండు రోజుల పాటు నిర్వహించే ఆటల పోటీల (ఖేల్ ఖుద్)ను ప్రారంభించారు. పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ భారతాన్ని నిర్మాణానికి క్రుషి చేసే శిల్పులు శిశుమందిర్ గురువులని కొనియాడారు. ఇంత గొప్ప స్కూల్ లో చదువుకోవడం గర్వంగా ఉందన్నారు.
సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి, ధర్మం వంటి అంశాలు శిశు మందిర్ లోనే నేర్చుకున్నానని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలన్నింటికీ పక్కా భవనాలు నిర్మించడంతోపాటు ల్యాప్ టాప్ సహా ఇతర సౌకర్యాలన్నీ కల్పించేందుకు క్రుషి చేస్తానని హామీ ఇచ్చారు. శిశుమందిర్ లో చదువుకున్న ఎంతో మంది అధికారులు అయ్యారని, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, రాజకీయ నేతలయ్యారని అన్నారు. శిశు మందిర్ లో చదువుకోవడంవల్లే నేను ఈ స్థాయికి చేరుకుని ప్రజలకు సేవ చేయగలుగుతున్నానని అన్నారు.
ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఆర్మీలో చేరి దేశానికి సేవ చేసేలా క్రుషి చేయాలని కోరారు. సరస్వతి శిశుమందిర్ అంటే ఒక భవనం కాదు, ఒక బ్లాక్ బోర్డు కాదు... ఒక సంకల్పం, ఒక సంస్కార దీపం. భారత మాత సేవ అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యా వ్యవస్థను కాంగ్రెస్ పాలకులు నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ప్రతి విద్యార్ధికి 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని మోసం చేశారని, గత నాలుగేళ్లుగా దాదాపు 10 వేల కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థులను, యాజమాన్యాలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామన్నారని ఆ ఊసే లేదన్నారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు టెన్త్ పాసైతే 10 వేలు, ఇంటర్ పాసైతే 15 వేలు, డిగ్రీ చేస్తే 25 వేలు, పీజీ చేస్తే లక్ష రూపాయలు ఇస్తామన్నారని, నయాపైసా ఇయ్యలేదన్నారు. ఆఖరికి తమ జీవితం మొత్తాన్ని స్కూల్ కు, ప్రభుత్వానికి అంకితం చేసిన రిటైర్డ్ టీచర్లు, ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ఇవ్వాలని అడిగిన పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతుందన్నారు. శిశు మందిర్ విద్యార్థులంతా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి భవిష్యత్తును నిర్మించుకోవాలని, శిశు మందిర్ లను ఆదరించి ప్రోత్సహించాలన్నారు.