calender_icon.png 10 January, 2026 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పద్దు చించేసి.. రైతును బెదిరించి!

07-01-2026 12:48:36 AM

కమిషన్ దారుకు వత్తాసు.. అన్నదాతకు అన్యాయం 

బాకీ డబ్బులు రాకుండా మోకాలడ్డు

వర్తక సంఘం దిగుమతి శాఖ కార్యదర్శి స్థాయి వ్యక్తి వ్యవహారం

లబోదిబోమంటున్న రైతు

ఖమ్మం, జనవరి 6 (విజయక్రాంతి): అతను ఖమ్మం వర్తక సంఘం దిగుమతి శాఖ కార్యదర్శి స్థాయి వ్యక్తి. ఖమ్మం గ్రెయిన్ మార్కెట్ కు సంబంధించిన ఏదైనా వివాదం తన వద్దకు వస్తే న్యాయం చెప్పాల్సిన వ్యక్తి. అలాంటి వ్యక్తే, కమీషన్ దారుకు వత్తాసు పలుకుతూ, రైతుకు అన్యాయం చేయజూస్తున్నాడు.  రైతు వద్ద ఉన్న అసలు బకాయి పద్దును తానే చించిపడేసి, కమిషన్ వ్యాపారి ఎలాంటి బాకీ లేడని రైతును దబాయిస్తున్నాడు.

అసలు బాకీ పద్దు లేకపోవడంతో తనకు రావలసిన డబ్బులు వస్తాయో రావోనని రైతు దిగులు చెందుతున్నాడు. దిగుమతి శాఖ కార్యదర్శి స్థాయి వ్యక్తి కమీషన్ దారుకు  వత్తాసు పలుకుతూ రైతుకు అన్యాయం చేయడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెట్ శాఖ అధికారులు, సంఘం నాయకులు కలిసి రైతుకు న్యాయం చేయడమే కాకుండా, కార్యదర్శి స్థాయి వ్యక్తి మరోసారి ఇలా వ్యవహరించకుండా  చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 

మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ మండలం, గొల్లగూడేనికి చెందిన రైతు గతేడాది జూన్ లో ఖమ్మం పట్టణానికి చెందిన ఓ కమీషన్ దారు వద్దకు తన పంటను అమ్ముకునేందుకు వచ్చాడు. సరుకు అమ్మిన తర్వాత అన్ని ఖర్చులు పోగా, కమిషన్ వ్యాపారి నుంచి రైతుకు రూ.2.40 లక్షలు రావాల్సి ఉంది. అయితే సదరు కమీషన్ దారు, ప్రస్తుతం తన వద్ద అంత సొమ్ము లేదని రూ.30 వేలు మాత్రమే ఉన్నాయని, మిగతా సొమ్ము తర్వాత ఇస్తానంటూ చెప్పాడు. కమిషన్ దారుని నమ్మిన రైతు సరేనంటూ అప్పటికి వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత నుంచి డబ్బు అడిగితే అదిగో ఇదిగో అంటూ కమీషన్ వ్యాపారి కాలయాపన చేస్తూ వచ్చాడు.  విసిగిపోయిన రైతు మొదట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయబోయాడు. సివిల్ వ్యవహారం కాబట్టి పోలీసులు కలగజేసుకోలేదు. వ్యవహారం పెద్ద మనుషుల సమక్షంలో తేల్చుకోవాలని రైతు నిర్ణయించుకుని, తనకు తెలిసిన వారి ద్వారా మాట్లాడించాడు. అప్పటినుంచి ఈ పంచాయితీ సాగుతూనే ఉంది. ఈ లోపు దిగుమతి శాఖ కార్యదర్శి స్థాయి పదవికి స్వతంత్రంగా పోటీ చేసి గెలిచిన వ్యక్తి వద్దకు సదరు పంచాయితీ చేరింది.

కమీషన్ దారు, రైతు వాదనలు విని ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పో నిర్ణయించకుండా కమీషన్ దారుకు, కార్యదర్శి స్థాయి వ్యక్తి వత్తాసు పలకడం మొదలుపెట్టాడు. సదరు కమీషన్ దారు తనకు బాకీ ఉన్నాడనడానికి ఆధారం ఇదిగోనంటూ రైతు తన వద్ద ఉన్న  బకాయి అసలు పద్దును చూపడం మొదలుపెట్టాడు. ఆ ఆధారం ఉంటే తనకు మాట్లాడటానికి ఏమీ ఉండదని భావించిన కార్యదర్శి స్థాయి వ్యక్తి, రైతు వద్ద ఉన్న బాకీ పద్దును చించేశాడు. దీంతో రైతు, అతని తరఫున మాట్లాడడానికి వచ్చిన పెద్ద మనుషులు విస్తూపోయారు. వర్తక సంఘం పదవిని అడ్డుపెట్టుకొని, ‘నా అంతటి వారు లేరంటూ’ వ్యవహరించడమేమిటని వారు నిలదీశారు. ‘బాకీ అసలు పద్దు ఇప్పుడు లేదు కదా, అసలు పద్దు ఉంటేనే బాకీ గురించి మాట్లాడదాం పోండి’ అంటూ దబాయించడం మొదలుపెట్టాడు. ఆయన తీరుతో విసిగిపోయిన రైతు కమీషన్ శాఖ అధికారికి మొరపెట్టుకున్నాడు. 

మిగతా రైతులు ఇబ్బందులు పడతారని..

కమీషన్ దారులు రైతులను ఇబ్బందులు పెడితే, వారి లైసెన్సులను నిలుపుదల చేసి రైతుకు న్యాయం జరిగేలా మార్కెట్ శాఖ అధికారులు వ్యవహరిస్తారు.  ప్రస్తుత పంచాయితీ కూడా మార్కెట్ శాఖ అధికారుల వద్దకు వెళ్ళింది. కమీషన్ దారు రైతుకు బాకీ ఉన్నాడన్న విషయంలో వాస్తవం ఉందని వారు కూడా నిర్ధారించారు.  అయితే కమీషన్ దారు లైసెన్స్ ను నిలుపుదల చేస్తే అతని వద్దకు వచ్చే మిగతా రైతులు ఇబ్బందులు పడతారని మార్కెట్ శాఖ అధికారులు ఆలోచిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కమీషన్ దారు సదరు రైతును ఇబ్బంది పెడుతున్నాడని తెలుస్తోంది. దీని వెనక కార్యదర్శి స్థాయి వ్యక్తి కూడా ఉన్నాడని సమాచారం. తమ మీద ఆధారపడి వ్యాపారం చేసే వారంతా తమనే మోసం చేస్తే భవిష్యత్తులో రైతు అనేవాడు మిగలడనే విమర్శలు రైతుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. 

ఇవాళ ఒకరికి జరిగిన అన్యాయం, రేపు మరో పది మందికి జరగకుండా ఉండాలంటే కమీషన్ దారుపై మార్కెటింగ్ శాఖ అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని, అలాగే సంఘం పదవిని అడ్డుపెట్టుకొని పేట్రేగిపోతున్న కార్యదర్శి స్థాయి వ్యక్తి పై సంఘం చర్యలు తీసుకొని, రైతుకు న్యాయం చేయాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు.