23-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 22(విజయక్రాంతి) : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వేలాది మంది అభ్యర్థులు నిరాశ చెందారు. గురువారం మరోసారి తీర్పు వాయిదా పడడంతో వారి ఆశలు నెరవేరలేదు. ఈ కేసుకు సంబంధించిన తీర్పును తెలంగాణ హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. గురువారం విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ తీర్పు కాపీ ఇంకా సిద్ధం కాలేదని న్యాయవాదులకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలపై గత కొంతకాలంగా న్యాయపరమైన సందిగ్ధత నెలకొంది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకల జరిగాయని, పారదర్శకత లోపించిందనే కారణాలతో మార్కుల తుది జాబితా, జనరల్ ర్యాంకులను రద్దు చేయడంతో పాటు జవాబుపత్రాలను పునర్ మూల్యాంకనం చేయాలని లేని పక్షంలో తాజాగా పరీక్షలు నిర్వహించాలంటూ గతంలో సింగల్ జడ్జి తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
ఆ తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీతో పాటు.. ఇందులో ఉద్యోగాలు పొందిన పలువురు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఆ అప్పీళ్లపై హైకోర్టు గతంలోనే విచారణ పూర్తిచేసింది. దీనిపై గురువారం తీర్పు వెలువరించాల్సి ఉండగా.. ఫిబ్రవరి ౫కి వాయిదా పడింది.అయితే, ఆ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించి, నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉండాలని స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వం 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసింది. దీంతో తుది తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.