03-08-2025 07:11:56 PM
హైదరాబాద్: ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యాలు చేస్తే బీఆర్ఎస్ సోదరులు మాట్లాడలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తనపై కుట్ర చేస్తున్నది బీఆర్ఎస్ లోని పెద్ద నాయకుడు అని, నల్గొండ జిల్లాలో ఓటమికి కారణమైన లిల్లీపుట్ నేత ఆమెపై మాట్లాడుతారా.. ? అని కవిత మండిపడ్డారు. కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ నేత ఎవరు..?, కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు లీక్ చేసిందెవరు..? అని ప్రశ్నించారు. ఎంపీ సీఎం రమేశ్ ఎందుకు మాట్లాడారో తెలియదని, ఆయనతో గత ఆరు నెలల్లో ఎప్పుడూ మాట్లాడలేదని కవిత అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ఓబీసీలకు పూర్తిగా అబద్ధాలు చెబుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓబీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఓబీసీలలో ముస్లింలు లేకుంటేనే రిజర్వేషన్లు ఇస్తామని బీజేపీ ఇప్పుడు చెబుతోందని, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన 42% బిల్లులో ముస్లింలను చేర్చాలా వద్దా అని కాంగ్రెస్ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. ఈ జాతీయ పార్టీల అబద్ధాలను బయటపెట్టడానికి, ఈ రెండు జాతీయ పార్టీల నుండి కొంత స్పష్టత వచ్చేలా చూసుకోవడానికి, రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే 72 గంటల నిరాహార దీక్షకు ప్రభుత్వం, కోర్టు అనుమతివ్వకుంటే ఇంటి నుంచే చేస్తా అని ఆమె తెలిపారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసే వారే నా వెనుక ప్రభుత్వం ఉంది అంటే ఎలా..? అని అడిగారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ నేతలెవరూ బీసీల గురించి మాట్లాడట్లేదు అని విమర్శించారు.