14-05-2025 04:49:50 PM
లోగో ఆవిష్కరణ...
సింగరేణి సిఅండ్ఎండీ ఎన్ బలరాం..
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలో సింగరేణి కార్మికుల పిల్లల విద్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పాఠశాలను ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జూన్ నెలలో నిర్వహించనున్న పాఠశాల స్వర్ణోత్సవాలను విజయవంతం చేయాలని సింగరేణి సంస్థ చైర్మన్ డైరెక్టర్ ఎన్ బలరాం(Singareni Chairman and Managing Director Balaram) కోరారు. భద్రాద్రి కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల స్వర్ణోత్సవ లోగోను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. 1975వ సంవత్సరం జూన్ నెలలో ప్రారంభమైన సింగరేణి ఎయిడెడ్ ఉన్నత పాఠశాల కళ్యాణిఖనీ ఈ సంవత్సరం 2025 జూన్ నాటికి సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందన్నారు.
పాఠశాలలో ఇప్పటివరకు సుమారు 40 వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసించి దేశ విదేశాలలో అనేక హోదాల్లో స్థిరపడ్డారని, సింగరేణి సంస్థలో అనేకమంది విద్యార్థులు ఉన్నతాధికారులుగా సేవలందిస్తున్నారని పాఠశాలలో మెరుగైన విద్యాబోధనతోనే అనేకమంది విద్యార్థులు ఉన్నత హోదాల్లో స్థిరపడ్డారని ఆయన గుర్తు చేశారు. పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, పది ఎకరాల స్థలంలో ఆట స్థలం, త్రాగు నీటీ సౌకర్యము, ఉచిత మధ్యాహ్న భోజనం, ప్రభుత్వం వారిచే అందిస్తున్న ఉచిత పుస్తకాలు, ఏక రూపదుస్తులు, ఆధునిక వసతులతో కూడిన సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, లైబ్రరీ, చక్కటి వసతులతో కూడిన అత్యాధునిక విద్యాబోధన పాఠశాల ప్రత్యేకతలని ఆయన స్పష్టం చేశారు.
సింగరేణి కార్మికుల పిల్లల విద్యాభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన పాఠశాలలో కార్మికుల పిల్లలతో పాటు పరిసర ప్రాంతాల వారి పిల్లలకు ఉచిత విద్యనందించి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత సింగరేణి పాఠశాలకే దక్కుతుందన్నారు. పాఠశాల స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో పాఠశాలను పట్టణ కార్మికుల పిల్లలు, పరిసర ప్రాంతాల ప్రజలు ఆదరించి ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం సింగరేణి సి అండ్ ఎండీ బలరాం, డైరెక్టర్(పా) వెంకటేశ్వర్లులు పాఠశాల కరస్పాండెంట్ ఎస్ శ్యాం సుందర్, ప్రధానోపాధ్యాయులు జే పురుషోత్తం, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్ వి సూర్యనారాయణ, డైరెక్టర్ (పా) సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ కే వెంకటేశ్వర్లు, సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి జి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి సునీల్ కుమార్ లు పాల్గొన్నారు.