12-08-2025 05:37:48 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహిళ మెడలో నుండి బంగారు చైను లాక్కెళ్ళిన ఘటనలో ప్రజల సహకారంతో ఇద్దరూ దొంగలను పట్టుకున్న మహబూబాబాద్ జిల్లా పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్(District SP Sudhir Ramnath Kekan) ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సోమవారం ఉదయం తొర్రూరు మండలం మాటేడు వద్ద ముత్యం ప్రేమలీల అనే మహిళను కత్తితో బెదిరించి చెంపపై కొట్టి మూడు తులాల బంగారు గొలుసు అపహరించిన ఘటనలో ప్రజల సహకారంతో ఉత్తర ప్రదేశ్ కు చెందిన వికాస్ కుమార్, శుభం కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వీరిని విచారించగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని షామిలి జిల్లా లక్ష్మణ్ పూర్ కు చెందిన వరసకు మామ అల్లుళ్ళని చెప్పారు.
నీడ చరిత్ర కలిగిన వీరు దక్షిణ భారతదేశంలో దొంగతనాలు చేసి అక్రమంగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో షామిలి నుండి ఢిల్లీ చేరుకొని అక్కడ నుండి కేరళ ఎక్స్ప్రెస్ రైలులో విజయవాడ వచ్చి అక్కడి నుండి పదో తేదీన ఖమ్మం చేరుకున్నారు. అక్కడ రెక్కి నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పార్కు చేసి ఉంచిన టీఎస్ 04 ఎఫ్ బీ 0862 నెంబర్ గల పల్సర్ బైక్ దొంగిలించారని, అక్కడనుండి రోడ్డు మార్గాన తొర్రూరు వైపు బయలుదేరి ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ప్రేమలీల నడిచి వెళ్తుండగా ఆమెను బెదిరించి బంగారు గొలుసు ఎత్తుకెళ్లారని చెప్పారు. విషయం తెలుసుకున్న దంతాలపల్లి బ్లూ కోర్ట్ కానిస్టేబుల్లు ఆకుల గణేష్, లోకేష్ వెంటాడగా వేములపల్లి వైపు పారిపోతుండగా దంతాలపల్లి ఎస్ ఐ రాజు, గ్రామస్తులు లింగయ్య, సాయి, ఉదయ్, బిక్షపతి కి సమాచారం ఇవ్వడంతో తొర్రూరు ఎస్ ఐ ఉపేందర్ కలిసి ఇద్దరు నిందితులను పట్టుకున్నారని చెప్పారు. వారి వద్ద నుండి దొంగిలించబడిన బైక్, బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దొంగలను పట్టుకున్న గ్రామస్తులు, ఎస్సైలు, పోలీసు సిబ్బందికి నగదు ప్రోత్సాహం అందించి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ డి.ఎస్.పి కృష్ణ కిషోర్, సి ఐ గణేష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, నెల్లికుదురు ఎస్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు.