12-08-2025 06:08:58 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): సాగుకు అవసరమైన యూరియాను అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని, రైతులు అడిగినంత యూరియా ఇవ్వకుండా, ఒకటి రెండు బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, ఎన్నిసార్లు యూరియా కోసం తిరగాలంటూ మంగళవారం మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) గూడూరు మండల కేంద్రంలో బి.ఆర్.ఎస్ నాయకులు రైతులతో కలిసి సహకార సంఘం ఎరువుల విక్రయ కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ కార్యదర్శి ఎన్.సురేందర్, చీదురు వెంకన్న, కటార్ సింగ్ తదితరులు మాట్లాడుతూ, వ్యవసాయానికి అవసరమైన యూరియాను ఇవ్వకపోవడం వల్ల, రైతులు ప్రతిరోజు యూరియా కోసం సొసైటీ వద్దకు వచ్చి వెళ్లాల్సి వస్తుందన్నారు.
పంటకు అవసరమైన యూరియాను ఒకేసారి తీసుకెళ్లడానికి వస్తే, ఒకటి రెండు బస్తాలు ఇస్తున్నారని, దీనితో రవాణా చార్జీలు భారంగా మారాయని, అటు వ్యవసాయ పనులను వదులుకొని ఇటు యూరియా కోసం తిరగాల్సి వస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి రైతులకు అవసరమైనంత యూరియా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రహీం, రామన్న స్టాలిన్, విజయ్, రమేష్, వెంకట్ రెడ్డి, రవి పాల్గొన్నారు. రైతులకు 846 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటివరకు సరఫరా చేశామని, అవసరమైన మేరకు యూరియా తెప్పించి ఇస్తున్నామని మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ తెలిపారు. అవసరానికి మించి యూరియా తీసుకెళ్లి, కృత్రిమ కొరత సృష్టించే అవకాశాలు ఉన్నాయని, రైతులకు ఇబ్బంది లేకుండా అవసరమైనంత యూరియా అందజేస్తామని, ఎవరు కూడా అపోహ పడవద్దని ఆయన సూచించారు. నానో యూరియా వినియోగం వల్ల అనేక లాభాలు ఉన్నాయని, నానో యూరియా వినియోగానికి ముందుకు రావాలని కోరారు.