12-08-2025 06:13:33 PM
రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు..
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
వనపర్తి (విజయక్రాంతి): వనపర్తి జిల్లాలో ఖరీఫ్ పంటకు అవసరమైన ఎరువు నిల్వలు ఉన్నాయనీ, రైతులు ఆందోళన పడి అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని సూచించారు. మంగళవారం ఆత్మకూరు మున్సిపాలిటీలోని సహకార వ్యవసాయ సంఘం ఎరువుల గోదాము, వినాయక సీడ్స్, పెస్టిసైడ్ షాపును జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) సందర్శించారు. పిఎసిఎస్ లో ఉన్న యూరియా నిల్వను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాకు అవసరమైన యూరియాను ప్రభుత్వం విడుదల చేస్తుందని, డీలర్లు వెనువెంటనే డబ్బులు కట్టి యూరియా బస్తాలు తెప్పించుకోవాలని సూచించారు.
ప్రతి ఎరువుల దుకాణం షాపు ముందు ఎరువుల నిల్వ, ధరల సూచిక బోర్డు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు గౌడ్ ను సూచించారు. జిల్లాలో రైతులకు సరిపడా యూరియా, ఇతర ఎరువులు ఉన్నాయని, ఎవరైనా డీలర్లు కృత్రిమ కొరతలు సృష్టిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రైతులు యూరియా కొరకు ఆందోళన పడకుండా ప్రస్తుతం అవసరమైన మోతాదులో మాత్రమే తీసుకువెళ్లాలని సూచించారు. యూరియా క్వింటాలు ఎంతకు కొంటున్నారు అని రైతులను ప్రశ్నించారు. క్వింటాలుకు రూ. 266 చొప్పున తీసుకుంటున్నామని రైతులు బదులిచ్చారు. అధిక ధరకు అమ్మితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, తహసిల్దార్ చాంద్ పాషా తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.