calender_icon.png 13 August, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు పాఠాన్ని చదవడమే కాకుండా పూర్తిగా అర్థం చేసుకోవాలి

12-08-2025 05:59:01 PM

జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్..

గద్వాల (విజయక్రాంతి): విద్యార్థులు పాఠాన్ని కేవలం చదవడం కాకుండా, దాని భావం పూర్తిగా అర్థం చేసుకునేలా బోధించాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్(District Collector B.M. Santosh) ఉపాధ్యాయులకు ఆదేశించారు. సోమవారం గద్వాల్ మండలంలోని పూడూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థుల అభ్యసన, హాజరు, ఏకరూప దుస్తులను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి, ఇంగ్లీష్ పాఠ్యంలోని ఒక పేరాగ్రాఫ్ చదివించారు. చాలా మంది విద్యార్థులు చదివినది అర్థం చెప్పలేకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చదువులో వెనుకబడిన వారికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పాఠాలు అందరికీ అర్థమయ్యే రీతిలో బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

విద్యార్థులు కేవలం పఠించడం మాత్రమే కాకుండా, దాని భావాన్ని, పూర్తిగా అర్థం చేసుకోనే విధంగా బోధించాలన్నారు. పాఠశాలలో హాజరు శాతం తక్కువగా ఉండటం గుర్తించిన కలెక్టర్, విద్యార్థులందరూ ప్రతిరోజూ తప్పనిసరిగా తరగతులకు హాజరవ్వాలని అన్నారు. ఎవరూ గైర్హాజరు కాకుండా ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలని, హాజరును ఖచ్చితంగా నమోదు చేయడానికి ప్రతిరోజూ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ వాడాలని ఆయన ఆదేశించారు.విద్యార్థులు యూనిఫాం ధరించకపోవడం పట్ల  ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనిఫాం పాఠశాల క్రమశిక్షణకు, విద్యార్థుల సమానత్వానికి ప్రతీక అని గుర్తు చేస్తూ,ప్రతి విద్యార్థి ప్రతిరోజూ తప్పనిసరిగా యూనిఫాం ధరించేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని సూచించారు. ఈ నియమాన్ని పాటించని పక్షంలో ప్రిన్సిపల్‌కు మెమో జారీ చేస్తామని సంబంధిత అధికారులకు సూచించారు.

పదవ తరగతి విద్యార్థులు  పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు,ఇప్పటి నుంచే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణతో చదవాలని సూచించారు. ప్రతిరోజూ పాఠాలను శ్రద్ధగా వినడం,అదే రోజు పునశ్చరణ చేయడం,అర్థం కాని భాగాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడం,క్రమం తప్పకుండా ప్రాక్టీస్ పరీక్షలు రాయడం వంటి అలవాట్లు అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.నిరంతర శ్రమ, పట్టుదల,సమయపాలనతో మాత్రమే మంచి మార్కులు సాధించగలమని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు.” అనంతరం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సహాయ లేబర్ కమిషనర్ మహేష్ కుమార్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ప్రియాంక, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, పాఠశాల సిబ్బంది,  తదితరులు పాల్గొన్నారు.