20-09-2025 01:00:08 AM
- జాతీయ పతాకం ఆవిష్కరించే సమయంలో సైరన్ మోగించిన కలెక్టర్
- కలెక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన సీఎస్
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్19 (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవం రోజున జాతీయ పతాకం ఆవిష్క రించే సమయంలో సైరన్ వేస్తూ జాతీయ గీతాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అవమానించారు. దీనిపై ఆగ్రహించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తనకు జరిగిన అవమానాన్ని ప్రభుత్వ పెద్దలకు సీఎస్‌కు స్వయంగా బుధవారం ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సిఎస్ సోమవారం రోజు మధ్యాహ్నం 3 గంటల లోపు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు గురువారం షోకాజ్ నోటీసు ఇచ్చి ఆదేశాలు ఇచ్చారు.
తరచూ వివాదంలో
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్ మానేరు ముంపు గ్రామం చీర్లవంచలో ఇంటిని కోల్పోయి నిరాశ్రయులయ్యారు వేల్పుల ఎల్లయ్య, లచ్చవ్వ దంపతులు. 15 ఏళ్లు గడుస్తున్న పరిహారం అందకపోవడంతో కోర్టును ఆశ్రయించారు వృద్ధ దంపతులు. గత జూన్ నెలలో 7.86 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని హై కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు పట్టించుకోకుండా, బాధితులకు నష్ట పరిహారం కూడా అందించలేదు. ఐతే మరోసారి ఈ వృద్ధ దంపతులు మాకు పరిహారం ఇవ్వట్లేదని కోర్టు ను ఆశ్రయించడంతో, కోర్టు కు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరవ్వలేదు.
దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి కలెక్టర్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు పిటిషనర్ తరపు న్యాయవాది బొమ్మన అర్జున్ రావు తెలిపారు. కలెక్టరేట్ సందీప్ కుమార్ ఝా కు ఇటువంటి పంచాయతీలు కొత్తేం కాదు. గతంలో ఓ మహిళ కూడా తనకు మిడ్ మానేరు ముంపు భాగంగా పరిహారం అందలేదని కోర్టును ఆశ్రయించగా పరిహారం చెల్లించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. అయితే నాపైనే కోర్టు వెళ్తావా అంటూ బాధిత మహిళపై కేసు పెట్టించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. దీనిపై మరోమారు మహిళా కోర్టు మెట్లెక్కడంతో ఆగ్రహించిన న్యాయమూర్తి కలెక్టర్ ను రెండు గంటలు కోర్టు హాల్లో నిల్చోపెట్టినట్టు సమాచారం.
ఈ సారుకు ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన నచ్చదు. పెట్రోల్ బంక్ పెట్టుకుంటానని ఓ యువకుడు రెండు సంవత్సరాల క్రితం జిల్లా కలెక్టర్ ఎన్‌ఓసి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పేపర్ లేదు ఆ పేపర్ లేదంటూ ఇప్పటికీ తిప్పుతూనే ఉన్నాడు. ఎందుకు తిప్పుతున్నారని ఓ మంత్రి దగ్గరకు వెళ్ళి తన బాధను వెళ్లగక్కాడు. దీనిపై మంత్రి కలెక్టర్ కు ఫోన్ చేసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగితే అదేం లేదు వారిని నా దగ్గరకు రమ్మనండి అంటూ సమాధానం ఇచ్చాడు. తీరా బాధితుడు మళ్ళీ వెళ్ళి కలెక్టర్ ను కలవగా ఇంకోసారి నాకు పైరవీలు చేయిస్తే నీపై కేసు పెట్టి జైల్లో పెట్టిస్తా అని బెదిరించాడని బాధితుడు విజయక్రాంతి ఎదుట బాధ పడుతూ తెలిపాడు.
ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామంలో ఓ రైతుపై ప్రభుత్వ భూమి కబ్జా చేసాడని ప్రజావాణిలో కొందరు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ నీకు అసెన్మైంట్ రిజిస్టర్ పేరు లేదని దొంగతనంగా భూమి పట్టా చేసుకున్నావని భూమిని స్వాధీనం చేసుకున్నాడు. అందు లో బాధిత రైతు వరి పంట సాగు చేస్తున్నాడు. బాధిత రైతు మాట్లాడుతూ నాకు 25 సంవత్సరాల క్రితమే ప్రోసీడింగ్స్ ఇచ్చారని అప్పటి నుండి నేను సాగు చేసుకుంటు న్నానని తెలిపాడు.
నాకు ఫిర్యాదు చేసిన వారు కూడా దాదాపుగా 50 ఎకరాల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని, కక్ష పూరితంగా నా ఒక్కడిపై చర్యలు తీసుకున్నారని, వారు కూడా గత ప్రభుత్వంలో వచ్చిన ధరణి పోర్టల్ లో దొంగతనంగా భూమి పట్టా చేసుకున్న వారిపై కూడా కటిన చర్యలు తీసుకోవాలని కోరాడు. గతంలో అనారోగ్యంతో సెలవులో ఉన్న ఓ మహిళా డాక్టర్ తన మీటింగ్ కు హాజరవ్వలేదని పనిచేస్తున్న దవాఖాన నుండి మరో చోటుకి బదిలీ చేసిన సంఘటన కూడా వివాదమయ్యింది.