calender_icon.png 15 January, 2026 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్టీవీ ఆఫీస్‌పై సిట్

15-01-2026 02:07:19 AM

మంత్రి, మహిళా ఐఏఎస్ కథనాలపై దర్యాప్తు వేగవంతం

సోదాలు ముమ్మరం.. ముగ్గురు జర్నలిస్టుల అరెస్ట్

అజ్ఞాతంలోకి ఛానల్ చైర్మన్ నరేంద్ర చౌదరి, సీఈవో రాజశేఖర్

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 14 (విజయక్రాంతి): రాష్ర్టంలో సంచలనం సృష్టి ంచిన మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారికి సం బంధించిన వివాదాస్పద కథనాల కేసులో సిట్  దర్యాప్తు వేగవంతం చేసింది. కథనాలను ప్రసారం చేసిన ఎన్టీవీలో ఆఫీసులో బుధవా రం సిట్ సోదాలు చేసి, ముగ్గురు జర్నలిస్టుల ను అదుపులోకి తీసుకున్నది. ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్‌ను మంగళవారం అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో అదుపు లోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు రిపోర్టర్లు పరిపూర్ణా చారి, సుధీర్‌ను అరెస్ట్ చేశారు. ఛానల్ చైర్మన్ నరేంద్ర చౌదరి, సీఈవో రాజశేఖర్ అజ్ఞాతంలోకి వెళ్లారు.

బుధవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని ఎన్టీవీ కార్యాలయంలో సిట్ అధికారులు జరిపిన సోదాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ముందస్తు నోటీసులు లేకుండా పోలీసులు ఆఫీసులోకి చొచ్చుకువెళ్లడం కలకలం రేపింది. బుధవారం మధ్యాహ్నం సిట్ బృందం ఎన్టీవీ కార్యాలయానికి చేరుకుంది. సెక్యూరిటీ సిబ్బం దిని పక్కకు నెట్టి నేరుగా లోపలికి వెళ్లే ప్రయ త్నం చేశారు.

సెర్చ్ వారెంట్ ఉందా అని సిబ్బ ంది ప్రశ్నించగా.. పోలీసులకు, ఛానల్ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వారెంట్ లేకుండా సోదాలు ఎలా నిర్వహిస్తారని సిబ్బంది నిలదీయడంతో వాతావరణం వేడెక్కింది. ఎడిటర్ ఎవరు? ఆయన క్యాబిన్ ఎక్కడ అంటూ పోలీసులు ఆరా తీశారని, సహకరించకపోతే ఛానల్ ప్రసారాలకు కీలకమైన సర్వర్ రూమ్‌ను సీజ్ చేస్తామంటూ బెది రించారని ఎన్టీవీ సిబ్బంది ఆరోపిస్తున్నారు.

బ్యాంకాక్ వెళ్తుండగా అరెస్ట్..

ఎన్టీవీ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్, ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్‌ను పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంగళవారం అర్ధరా త్రి అదుపులోకి తీసుకున్నారు.  దొంతు రమే ష్ తన కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర కోసం బ్యాంకాక్ వెళ్లేందుకు శంషాబా ద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు అక్కడికి చేరుకుని, ఇమ్మిగ్రేషన్ చెక్ పూర్తయ్యేలోపే ఆయ న్ను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబం కళ్లెదుటే ఆయన్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

విదేశాలకు వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా లుక్ అవుట్ నోటీసు లు ఏమైనా జారీ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. దొంతు రమేష్‌తో పాటే ఇదే కేసుకు సంబంధించి ఎన్టీవీకి చెందిన మరో ఇద్దరు రిపోర్టర్లు పరిపూర్ణా చారి, సుధీర్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ లో ముగ్గురు జర్నలిస్టులను విచారించి అనంతరం ఒకరిని విడుదల చేశారు. దొంతు రమేష్, సుధీర్‌ను కింగ్ కోఠిలోని ప్రభుత్వ హస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ వద్దకు హజరుపరిచేందకు తరలించారు. 

అజ్ఞాతంలో యాజమాన్యం..

ఇదిలా ఉండగా, అరెస్టుల పర్వం కొనసాగుతుండటంతో ఎన్టీవీ యాజమాన్యం అప్రమత్తమైనట్లు సమాచారం. ఛానల్ చైర్మన్ నరేంద్ర చౌదరి, సీఈవో రాజశేఖర్ ప్రస్తుతం అందుబాటులో లేరని, అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు సిట్ బృందాలు వారి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. 

కటకటాలే: డీజీపీ

సోషల్ మీడియా ముసుగులో ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారికి డీజీపీ శివధర్‌రెడ్డి గతంలో ఇచ్చిన హెచ్చరికలు ఇప్పుడు అక్షర సత్యాలవుతున్నాయి. బాధ్యతలు స్వీకరించిన తొలి నాడే ఆయన సోషల్ మీడియా తీరుపై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. తాజాగా లేడీ ఐఏఎస్, సీఎం రేవంత్ రెడ్డి మార్ఫింగ్ కేసుల్లో సిట్ ఏర్పాటు, అరెస్టుల పర్వం చూస్తుంటే.. డీజీపీ నాడే చెప్పిన మాటలను ఇప్పుడు చేతల్లో చూపిస్తున్నారని అర్థమవుతోంది. 


తప్పు చేయనప్పుడు పారిపోవడమెందుకు?

  1. అందుకే ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నాం
  2. సీపీ సజ్జనార్ వ్యాఖ్యలు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 14 (విజయక్రాంతి): మహిళా ఐఏఎస్ అధికారిపై అసత్య ప్రచారాలు, సీఎం ఫొటోల మార్ఫింగ్ కేసులో ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టుపై వస్తున్న విమర్శ లను సిట్ సీపీ, హైదరాబాద్ సీపీ సజ్జనార్ తిప్పికొట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళా ఐఏఎస్ అధికారిపై వ్యక్తిగత దాడులు చేయడం అమానవీయమని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా స్వేచ్ఛ పేరుతో నిరాధారమైన ఆరోపణలు చేయడం, కుటుంబాలను రోడ్డుకీడ్చడం సరైన పద్ధతి కాదు’ అని హితవు పలికారు. చట్టపరంగానే తాము చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో కక్ష సాధింపు ఏమీ లేదని స్పష్టం చేశారు.

నోటీసులు ఇవ్వకుండానే అరెస్టులు చేశారన్న విమర్శలపై సీపీ ఘాటుగా స్పందించారు. ‘విచారణకు పిలిస్తే రావాలి కదా. ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని, రాత్రికి రాత్రే 5.30 గంటలకు టికెట్లు బుక్ చేసుకుని బ్యాంకాక్ ఎందుకు వెళ్తున్నారు. తప్పు చేయనప్పుడు పారిపోవాల్సిన పనేముంది? అందుకే ఎయిర్‌పోర్టులో అదుపు లోకి తీసుకోవాల్సి వచ్చింది. పారిపోతుంటే చూస్తూ ఊరుకుంటామా. ఎక్కడున్నా పట్టుకొస్తాం’ అని హెచ్చరించారు. విచారణకు స హకరించకుండా తప్పించుకు తిరగడం వల్లే కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. 

ఆధారాల సేకరణకే ఎన్టీవీకి వెళ్లాం

‘అమ్మ అంటేనే సృష్టి. అమ్మను, స్త్రీని అవమానిస్తే సాక్షాత్తూ సృష్టినే అవమానించినట్లు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మహిళా అధికారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం సభ్యసమాజం తలదిం చుకునే చర్య. తప్పు చేయనప్పుడు భయమెందుకు? విచారణ నుంచి తప్పించుకుని విదేశాలకు ఎందుకు పారిపోతారు’ అని మండిపడ్డారు. ఆధారాలు సేకరించేందుకే సిట్ ఎన్టీవీ ఆఫీసుకు వెళ్లిందని, ఎవరిపైనా దాడులు చేయలేదని చెప్పారు.