28-11-2025 12:00:00 AM
సీపీ సజ్జనార్ సమీక్ష తర్వాత కేసులో మళ్లీ కదలిక
‘బీఆర్‌ఎస్ సుప్రీం’ ఆదేశాల మేరకే ట్యాపింగ్
రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు
హైదరాబాద్, సిటీ బ్యూరో, నవంబర్ 27 (విజయక్రాంతి) : తెలంగాణలో రాజకీయం గా పెను సంచలనం సృష్టించి, కొన్నా ళ్లుగా స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాలతో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందు లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ వద్ద గతం లో ఓఎస్డీ గా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డిని సిట్ అధికారులు విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిట్ నోటీసుల మేరకు రాజశే ఖర్‌రెడ్డి గురువారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.
దాదా పు రెండు గంట ల పాటు అధికారులు ఆయ న్ను ప్రశ్నించారు. ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన పాత్ర, అప్పటి ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలపై ఆరా తీశారు. విచారణ అనంతరం ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి, కేసు ఫైల్‌లో జతచేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో గతంలో కీలక విషయాలు వెల్లడించారు.
బీఆర్‌ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డామని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన, ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆ ‘సుప్రీం’ ఎవరు? ఆదేశాలు ఎలా అందేవి? అనే కోణంలో కూపీ లాగుతున్నారు.
సజ్జనార్ ప్రవేశంతో ..
ఇటీవల హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్.. పెండింగ్‌లో ఉన్న ఈ హై -ప్రొఫైల్ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిం చి ఇప్పటివరకు దాఖలైన ఛార్జ్ షీట్లు, సస్పెండ్ అయిన అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన దిశానిర్దేశం చేసిన వెంటనే మాజీ ఓఎస్డీ విచారణ జరగడం గమనార్హం. మరోవైపు, విదేశాల నుంచి వచ్చిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యవహారంపైనా సిట్ సీరియస్‌గా ఉంది. ఆయన్ను విచారించినా సరైన సమాచారం ఇవ్వడం లేదని, సహకరించడం లేదని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఆయనకు అరెస్ట్ నుంచి ఉన్న మినహాయింపును రద్దు చేయాలని కోరు తూ సిట్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2023 ఎన్నికల సమయంలో, నవంబర్ 15 నుంచి 30 వరకు.. అంటే కేవలం పక్షం రోజుల వ్యవధిలోనే సుమారు 4,013 ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్లు సిట్ నిర్ధారించింది. ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా సాగిన ఈ నిఘా నేరాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది.