08-11-2025 01:01:05 AM
లక్నో, నవంబర్ 7: ఏమీ తెలియని అమాయకురాలిగా నగల దుకాణంలోకి ప్రవేశించింది. ఉన్నట్టుండి ఎదురుగా కూర్చున్న యజమాని కంట్లో కారం కొట్టింది. అంతే.. సీట్‌లో కూర్చున్న ఒక్క ఉదుటన లేచి సదరు మహిళను చేతిలో పట్టుకుని 20 సెకన్లలో ఏకధాటిగా 17 చెంపదెబ్బలు కొట్టాడు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరలయ్యాయి. అహ్మదాబాద్‌లోని రానిప్ ఏరియాలోని ఓ నగల దుకాణానికి ఒక మహిళ ముఖానికి దుపట్టా కట్టుకుని వచ్చి కుర్చీలో కూర్చుంది. యాజమాని కళ్లలో కారం కొట్టి నగలు దోచుకెళ్లాలని పథకం వేసింది.
దీనిలోభాగంగానే యజమాని కళ్లలో కారం కొట్టింది. అప్రమత్తమైన షాపు యజమాని వెంటనే ఎదురు దాడి ప్రారంభించాడు. 20 సెకన్లలో దాదాపు 17 సార్లు చెంపదెబ్బలు కొట్టి, ఆమెను షాపులోంచి బయటకు నెట్టివేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. షాపులో సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు ఆ మహిళ కోసం గాలిస్తున్నారు.