08-11-2025 01:03:44 AM
చెన్నై, నవంబర్ 7: తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ తనకు అధికారం వస్తుందని పగటి కలలు కంటున్నారని మరములార్చి ద్రావిడ మున్నెట్ర కళగం (ఎండీఎంకే) అధినేత వైగో సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీవీకే, -డీఎంకే మధ్యే ఉంటుందా..? అని శుక్రవారం ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు.
విజయ్‌కి రాజకీయాల్లో కనీసం ఓనమాలు కూడా తెలియ వని, గాల్లో మేడలు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయ్ ఇప్పటికే ముఖ్యమంత్రి అయినట్లు.. తనకు తానే భావిస్తున్నారని విమర్శించారు. సముద్రాన్ని పేపరు పడవ ఈదాలని చూడటం మూర్ఖత్వమని పేర్కొన్నారు. ఆయన కలలన్నీ చివరకు ఎండమావులవుతాయని గుర్తించలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు.
కరూర్ తొక్కిస లాట బాధిత కుటుంబాలను ఓ రిసార్టుకు ఆహ్వానించడంపై వైగో మండిపడ్డారు. బాధిత కుటుంబాలను వారి నివాసాల్లోనే పరామర్శించకుండా, రిసార్టుకు పిలిపించుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
తమిళనాడు చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిణామం చూడలేదని, అది ఒక కుట్ర అని ఆరోపించారు. గతంలో తూత్తుకుడిలో నిరసనల సందర్భంగా పోలీసుల కాల్పుల్లో 13 మంది చనిపోతే.. బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి తాను స్వయంగా పరామర్శించానని గుర్తుచేశారు.