calender_icon.png 25 October, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యామ్ రోడ్ల టెండర్లలో చిన్న కాంట్రాక్టర్లకూ అవకాశం

25-10-2025 01:14:08 AM

-బిల్లుల చెల్లింపుల్లో ఆందోళన అక్కర్లేదు..

-పెండింగ్ బిల్లుల రూ.100 కోట్ల చెల్లింపునకు కృషి

-మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : వచ్చే ఏడాది ఆరంభం నుంచి రాష్ట్రంలో రూ.11 వేల కోట్ల అంచనాతో హ్యామ్ రోడ్ల పనులు ప్రారంభం అవుతాయని, నిర్మాణ టెండర్లలో చిన్న కాంట్రాక్ట ర్లూ పాల్గొనవచ్చని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో శుక్రవారం హ్యామ్‌రోడ్ల టెండర్లపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభు త్వం మొత్తం 32 ప్యాకేజీల్లో 400 రోడ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు.

బిల్లుల చెల్లింపుల విషయంలో కాంట్రాక్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సహాయ సహకారాలతో సత్వరం బిల్లులు విడుదల చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. యువత హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ నేరమన్నారు.

మొబైల్ మాట్లాడుతూ వాహనదారులు డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చొద్దని సూచించారు. అనంతరం ఆయన కాంట్రాక్టర్లకు తీపికబురు చెప్పారు. తాను సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి రూ.100 కోట్ల పెండింగ్ బిల్లుల పేమెంట్‌కు కృషి చేస్తానని, త్వరలో మిగిలిన రూ.50 కోట్ల బిల్లులు విడుదలయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.