29-11-2025 01:12:41 AM
హుస్నాబాద్, నవంబర్ 28 :బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. శుక్రవారం జేఏసీ ఆధ్వర్యంలో పూలే వర్ధంతిని హుస్నాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది అంటూ జ్యోతిరావు పూలే సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ.. కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు. అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు. మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన భార్య సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేసిన గొప్ప ఆచరణ వాది అని కొనియాడారు.
సమాజ పునర్నిర్మాణానికి పూలే చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రవీందర్, వివిధ పార్టీల నాయకులు కోహెడ కొమురయ్య, సమ్మయ్య, శ్రీదేవి, సత్యనారాయణ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.