29-11-2025 01:10:47 AM
ఆవిష్కరణ-ఆధారిత పర్యావరణ వ్యవస్థ ప్రత్యక్ష పరిశీలన
పటాన్ చెరు, నవంబర్ 28 :గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాదులోని విద్యార్థులు శుక్రవారం వీ-హబ్ ను సందర్శించారు. మహిళా వ్యవస్థాపకుల కోసం మనదేశంలో మొట్టమొదటి రాష్ట్ర నేతృత్వంలోని ఇంక్యుబేటర్ అయిన వీ-హబ్ ను పారిశ్రామిక సందర్శనలో భాగంగా, విద్యార్థులు ప్రత్యక్షంగా పరిశీలించి, పలు విలువైన విషయాలను ఆకలింపు చేసుకున్నారు. గీతంలోని వెంచర్ డెవలప్ మెంట్ సెంటర్ (వీడీసీ), మహిళా సాధికారత విభాగం సంయుక్త సహకారంతో ఈ పర్యటనను నిర్వహించారు. వ్యవస్థపకుల క్లబ్ (ఈ-క్లబ్), మహిళా నాయకుల ఫోరమ్ సహకారంతో ఈనెల 24న బూట్ క్యాంప్ నిర్వహించారు.
దానికి కొనసాగింపుగానే ఈ పర్యటనను ఏర్పాటు చేశారు. వీ-హబ్ యొక్క ఆవిష్కరణ-ఆధారిత పర్యావరణ వ్యవస్థను విద్యార్థులకు ప్రత్యక్షంగా పరిచయం కల్పించడం ఈ సందర్శన లక్ష్యం. మహిళల నేతృత్వంలోని స్టారప్ట్ లకు మార్గదర్శకత్వం వహించే, ప్రోత్సహించే, సాధికారత కల్పించే కార్యక్రమాలపై విద్యార్థులు విలువైన సమాచారాన్ని పొందారు. వ్యవస్థాపక ఆలోచనలు స్కేలబుల్ వ్యాపార వెంచర్లగా ఎలా అభివృద్ధి చెందుతాయో వారు తెలుసుకున్నారు. అక్కడి వారితో నిర్వహించిన ముఖాముఖిలో, పరిశీలన, ఊహ, సహానుభూతి నుంచి ఆవిష్కరణలు ఎలా ఉద్భవిస్తాయో గీతం విద్యార్థులు పరిశీలించారు.
వీ-హబ్ లోని కార్యకలాపాలు వేగవంతమైన ఆలోచన, సమస్య గుర్తింపు, వినియోగదారు-కేంద్రీకృత పరిష్కారాల సృష్టిని ప్రోత్సహించాయి. సహకార బృందాలలో పనిచేస్తూ, విద్యార్థులు త్వరిత నమూనాలను అభివృద్ధి చేయడమే గాక, వాస్తవ-ప్రపంచ సవాళ్ల ద్వారా సృజనాత్మకత ఎలా వృద్ధి చెందుతుందో స్వయంగా పరిశీలించారు. మహిళా సాధికారత సెల్ ప్రతినిధులు డాక్టర్ ఎ.ఫణి శీతల్, డాక్టర్ దుర్గేష్ నందిని ఈ పారిశ్రామిక సందర్శనలో విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారు.మొత్తంమీద, పారిశ్రామిక సందర్శన సుసంపన్నమైన, స్ఫూర్తిదాయకమైన అభ్యాస అనుభవాన్ని అందించిందని తెలిపారు.