16 April, 2026 | 11:45 AM

సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీ

13-05-2025 01:06 AM

కరీంనగర్, మే12(విజయక్రాంతి): దేశ ప్రజల రక్షణకు పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్న భారత సైన్యానికి (సాయుధ దళాలు) మద్దతుగా సోమవారం జిల్లా కేంద్రంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. టీఎన్జీవో, టీజీవో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీని కలెక్టరేట్ వద్ద కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుంచి ప్రతిమ మల్టీప్లెక్స్ మీదుగా అమరవీరుల స్తూపం వద్దకు చేరింది.

ర్యాలీలో  వివిధ శాఖల అధికారులు, ఎన్ సీ సీ కేడేట్లు, నగరపాలిక కార్మికులు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాలను పట్టుకొని ర్యాలీ కొనసాగిస్తూ.. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

యుద్ధంలో  వీరమరణం పొందిన జవాను మురళి నాయక్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, టీజీవో జిల్లా అధ్యక్షుడు కాలీచరణ్, పోలీసు, ఎక్సైజ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.