12-08-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని తాడిగూడ గ్రామంలో తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గ్రామంలో ఉన్న ఏకైక బోర్ అడగంటి పోవడంతో సమస్య తీవ్రమైంది. బావి నుంచి సప్లయ్ చేసే కరెంటు మోటార్ రెండు రోజుల క్రితం కాలిపోవడంతో ట్యాంక్‌కి నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. దాహం తీర్చుకోవడానికి కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగు నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుంది.
మామిడిపల్లి పంచాయితీ పరిధిలోని ఈ మారుమూల గ్రామానికి తాగునీటి సమస్య తీర్చడానికి రెండు చేతి పంపులు ఉన్నాయి. అయితే ఈ రెండు ఎండిపోవడంతో ఆదివాసీల కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. మిషన్ భగీరథ పథకంలో భాగంగా గ్రామానికి పైపులైన్ వేసినప్పటికీ అప్పటి సర్కారు నీళ్లు మాత్రం వదలడంలో విఫలమైంది. ఉన్న ఒక్క బోరు నుంచి ఇప్పటివరకు నీళ్లు తెచ్చుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఆ బోరు అడుగంటిపోవడం.. మోటార్ చెడిపోవడంతో సమస్య క్లిష్టతరమైంది.
దీంతో నీళ్లు తెచ్చుకోవాలంటే కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తోంది. మా ఊరి ఆడపిల్లలు, మహిళలు నీళ్లు తెచ్చుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. జనజీవనానికి దూరంగా బతుకుతున్న మాకు తాగునీటికి కటకట ఏర్పడకుండా ఏదైనా మార్గం చూపిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. అధికారులు తక్షణమే స్పందించి మోటర్ మరమ్మత్తు చేసి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం.
రాంనాయక్, తాడిగూడ, ఆసిఫాబాద్ జిల్లా