calender_icon.png 4 November, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిక్కుముడి వీడేనా!

23-10-2025 12:00:00 AM

నాలుగేళ్లు కావొస్తున్నా రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పడటం లేదు. ఏదో ఒక కారణంతో ఇప్పటికీ ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటూనే వస్తున్నాయి. ఇటీవలే ఉక్రెయిన్‌లోని అత్యంత కీలకమైన డాన్బాస్ ప్రాంతాన్ని తమకు అప్పగించాల్సిందేనని ర ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటి తమ సేనల ఆధీనంలో ఉన్న జపొరియా, ఖేర్సాన్‌లను ఉక్రెయిన్‌కు అప్పజెప్పేందుకు పుతిన్ సానుకూలంగా ఉన్నారని, అయితే డాన్బాస్ ప్రాంతాన్ని తమ కు పూర్తిగా అప్పగించాలనే షరతు పెట్టారు.

అమెరికా అధ్యక్షుడు డొ నాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లైన్‌లో మాట్లాడినప్పుడు కూడా పుతిన్ ఇదే ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు వైట్‌హౌస్ మీడియా ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు యూరోపియన్ దేశాలు సైతం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు శతవిధాల ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా యుద్ధాన్ని  సరిహద్దులోనే ముగించేలా 12 అంశాల ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నాయి.

ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన వెంటనే పరస్పర ఖైదీల మార్పిడితో పాటు ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు, యుద్ధ నష్టాన్ని సరిచేయడానికి నిధులు, యూరోపియన్ యూనియన్‌లో చేరడానికి అవకాశం కల్పిస్తామని యూరోపియన్ దేశాలు తెలిపాయి. మరోవైపు ఆక్రమిత భూభాగాలపై మాస్కో, కీవ్ మధ్య చర్చలు జరుగుతాయని, అయితే యూరప్ లేదా ఉక్రెయిన్ చట్టబద్ధంగా ఏ భూమిని రష్యాకు చెందినవిగా గుర్తించవని తెలిపింది.

ఒకవేళ రష్యా, ఉక్రెయిన్‌పై దాడులకు తెగబడితే తిరిగి ఆంక్షలు అమల్లోకి వచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ట్రంప్ అధ్యక్షతన ఏర్పాటవనున్న శాంతి బోర్డు.. ప్రణాళిక అంశాలను పర్యవేక్షించాల్సి ఉంది. ప్రస్తుతం ఫ్రంట్ లైన్ వద్ద జరుగుతున్న కాల్పులు ఆగితేనే ప్రణాళిక ప్రతిపాదన తెరమీదకు వచ్చే అవకాశముంది. ఇక ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ మధ్య గతంలో సంధి కుదర్చడానికి ప్రయత్నించి దెబ్బతినాల్సి వచ్చింది.

ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అమెరికాకు రెండో దఫా అధ్యక్షుడైన కొద్ది రోజులకే ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనెస్కీని వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. ఇరువురి మధ్య చర్చ వాడీవేడీగా జరిగింది. జెలెనెస్కీ మాట తీరును ఖండించిన ట్రంప్ మీడియా ముందటే ఆయనకు చివాట్లు పెట్టడం అప్పట్లో సంచలనం కలిగించింది. అయితే యుద్ధం ఆపాలంటూ ట్రంప్..

జెలెనెస్కీని రెండు రో జుల క్రితం మళ్లీ వైట్‌హౌస్‌కు పిలిపించారు. ఉక్రెయిన్‌లోని డాన్బాస్ ప్రాం తాన్ని రష్యాకు అప్పగించాలని, రష్యా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్‌ను నాశనం చేయటం పుతిన్‌కు పెద్ద పనేమీ కాదని జెలెనెస్కీని హెచ్చరించారు. అయితే దేశ సార్వభౌమాధికారం, సరిహద్దులను మార్చలేమని జెలెనెస్కీ తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌కు సైనిక సాయం పరిమితం చేయడంతో పాటు తోమహక్ క్షిపణులను సరఫరా చేయడం నిలి పేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు.

తాజాగా మంగళవారం ట్రంప్ ఇరు దేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు వారు ఎక్కడున్నారో అక్కడే యుద్ధాన్ని ఆపి చర్చలు జరపాలని సూచించారు. ట్రంప్ ప్రతిపాదనలు సరైనవేనని జెలెనెస్కీ సమర్థించడం గమనార్హం. ఈలోగా బుడాపెస్ట్ వేదికగా ట్రంప్, పుతిన్ మధ్య జరగాల్సిన సమావేశం వాయిదా పడడంతో సమస్య చిక్కుముడి ఎప్పుడు వీడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.