వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కుమారుడి హత్య
తల్లి జ్యోతి, ప్రియుడు నవీన్‌ను అరెస్టు చేసిన కీసర పోలీసులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 22 (విజయక్రాంతి): అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో రెండేళ్ల కుమారుడిని తల్లి తన ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో వెలుగుచూసింది. ఈ కేసును ఛేదించిన కీసర పోలీసులు బాలుడి తల్లి రంగా జ్యోతి, ఆమె ప్రియుడు మొగిళ్ల నవీన్ను అరెస్టు చేశారు. చిర్యాల గ్రామంలోని ఈడెన్ గార్డెన్స్కు చెందిన రంగా స్వామి కుమారుడు హరికృష్ణ (2) మే 29న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. బాలుడు కిందపడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడని తల్లి చెప్పడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అయితే ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించగా జ్యోతి, నవీన్ల మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఘటన జరిగిన రోజు నవీన్ ఇంటికి వచ్చినట్లు, అనంతరం బాలుడిని ఆసుపత్రికి తరలించడంలోనూ పాల్గొన్నట్లు తేలింది. దీంతో అనుమానం బలపడటంతో జూన్ 19న బాలుడి మృతదేహాన్ని వెలికితీసి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.
విచారణలో తమ సంబంధానికి బాలుడు అడ్డుగా ఉన్నాడని భావించిన జ్యోతి, నవీన్ ముందస్తు ప్రణాళికతో హత్య చేసినట్లు వెల్లడైంది. నవీన్ బాలుడిని నేలపై బలంగా కొట్టగా, జ్యోతి సహకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా చిత్రీకరించేందుకు బాలుడిని ఆసుపత్రికి తరలించినట్లు దర్యాప్తులో తేలింది. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు వివరాలను జవహర్నగర్ ఏసీపీ చక్రపాణి వెల్లడించారు.






