calender_icon.png 11 October, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జన్మనిచ్చిన తండ్రిపై కొడుకులు క్రూరత్వం..!

10-10-2025 11:39:29 PM

పెన్ పహాడ్: కట్టుకున్న భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో కాటికి దగ్గర అయిన తన తల్లికి సంరక్షకుడిగా, కన్న కొడుకులకు ఆలనా పాలనాగా ఉంటూ తనకున్న భూమిని నమ్ముకొని వేరుగా జీవిస్తున్నాడు ఆ తండ్రి. అలాంటి తరుణంలో కట్టుకున్న భర్తని ఎలాగైనా హంతం చేసి భూమిని కైవసం చేసుకోవాలని కన్న కొడుకులను హుసిగొల్పి ఆశపడ్డ ఇల్లాలికి, కొడుకులకు చెరసాల గతి తప్పలేదు. జన్మనిచ్చిన తండ్రిపైనే దాడి చేసి రాక్షసత్వం ప్రదర్శించిన ఇద్దరు కొడుకులను పోలీసులు అరెస్టు చేసి నిందితులను రిమాండ్‌కి తరలించగా భార్య పరారిలో ఉంది. ఈ హృదయ విధారక ఘటన మండలంలోని మేగ్యా తండాలో కలకలం రేపిన విషయం విధితమే.

రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాలు ప్రకారం... తండాకు చెందిన అంగోతు కుర్వా తన భార్య కోటమ్మ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని కొన్ని యేండ్లుగా పట్టణంలో జీవిస్తుంది. వీరికి ఉన్న ఇద్దరు కుమారులు పవన్ కళ్యాణ్, ప్రవీణ్ కుమార్. వీరు తల్లి దగ్గరే ఉంటూ అప్పుడప్పుడు తండాకు వస్తుంటారు. కుర్వా తన పేరున ఉన్న 6 ఎకరాలు భూమిని చేసుకుంటూ తన తల్లిని చూసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ భూమిలో కొంత అమ్ముకోవాలని చూస్తుండగా తన భర్త ఉన్నంత కాలం భూమి దక్కదని అనుకున్న భార్య కోటమ్మ భర్త కుర్వాను చంపడానికి పథకం పన్ని తన కొడుకులను సోమవారం అర్ధరాత్రి తండాకు పంపించింది.

ఆ రాత్రి తండ్రికాళ్ళు, చేతులు కట్టేసి,నోట్లో గుడ్డలు కుక్కి రాడ్, కర్రతో చితక బాది చంపే ప్రయత్నం చేశారు ఇద్దరు కొడుకులు. ఈ లోగా తండావాసులు వస్తారనే భయంతో వారు వెంట తెచ్చుకున్న బైకుపై గాయాలు, అపస్మారక స్థితిలో ఉన్న  తన తండ్రిని సూర్యాపేట తీసుకెళ్లి జనరల్ ఆసుపత్రి చేర్పించి పరార్ అయ్యారు. ఈ మేరకు బాధితుని ఫిర్యాదు మేరకు భార్య కోటమ్మతో పాటు ఇద్దరు కుమారులపై కేసు నమోదు కాగా పవన్ కళ్యాణ్, ప్రవీణ్ కుమార్ లను అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు, భార్య పరారిలో ఉన్నట్లు సీఐ తెలిపారు. వారి వెంట ఎస్ఐ గోపి కృష్ణ, సిబ్బంది లింగరాజు, సైదయ్య ఉన్నారు.