calender_icon.png 18 October, 2025 | 10:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సౌటకుంట’.. కబ్జా తంటా!

18-10-2025 12:00:00 AM

  1. 42 ఎకరాలకు 42 గజాలు సైతం లేనివైనం  
  2. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో భారీ నిర్మాణాలు
  3. కల్వర్టులను మాయంచేసిన ‘రియల్’ వ్యాపారులు 
  4. పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీలో కబ్జాల బాగోతం

ఒకనాడు బంగారు పంటలు పండిన పొలాలు.. కాలం కన్నెర్రజేయడంతో బీళ్లుగా మారాయి. కాలక్రమేణా రియల్ ఎస్టేట్ కబంధ హస్తాల్లో ఆ కుంట మాయమైంది. కల్వర్టులు, వరద కాల్వలు కాలగర్భంలో కలిసిపోయాయి. పచ్చని పొలాలు ప్లాట్లుగా మారాయి. నిబంధనలకు పాతరేసి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిబంధనలను తుంగలో తొక్కి పెద్ద పెద్ద భవంతులు పైకి లేచాయి.

నాడు 42 ఎకరాల్లో విస్తరించిన ఉన్న కుంట నేడు 42 గజాల్లో కనిపించడం లేదంటే ‘రియల్ గద్దలు’ ఎలా మింగేశాయో అర్థం చేసుకోవచ్చు. ఇది ఎక్కడో కాదు హైదరాబాద్ మహానగరానికి కూత వేటు దూరంలో ఉన్న పెద్దఅంబర్‌పేట్‌మున్సిపాలిటీ పరిధిలోని సౌటకుంట దీనగాథ.. రక్షించేవారి కోసం ఎదురుచూస్తున్నది..!

రంగారెడ్డి, అబ్దుల్లాపూర్‌మె, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : రంగా రెడ్డి శివారు భూములకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.ఒక గజం స్థలం కూడా లక్షలలో ధర పలుకుతుండడంతో  శివారు ప్రాంతాలపై  అక్రమార్కుల  కన్ను పడింది. ఈ ప్రాంతం దిన దినాభివృద్ధి చెందుతున్న క్రమంలో రియల్ మాఫియా  చెరువులు కుంటలు, ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలు దర్జాగా కబ్జాలు చేసి క్రయవిక్రయాలకు పాల్పడుతూ   తమ జేబులు నింపుకుంటున్నారు.

ఎఫ్టీఎల్, బఫర్‌జోన్లను  సైతం  వదలడం లేదు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్‌మున్సిపాలిటీ పరిధిలోని సౌటకుంట 42 ఎకరాలు విస్తీర్ణంలో ఉండే  ప్రస్తుతం 42 గజాలు కూడా లేకపోవడంతో ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సౌటకుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి భారీ నిర్మాణాలతో పాటు కమర్షియల్‌కన్వెన్షన్‌ను నిర్మించిన సంబంధిత అధికారులు కండ్లప్పగించి చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.

సౌటకుంట నీటి తోనే సాగు..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌మండలం పెద్దఅంబర్‌పేట్‌లోని 144, 184, 186, 187, 188, 189, 190/1, 190/2, 190/3, 190/4, 191, 192 దాదాపు 42 ఎకరాల్లో సౌటకుంట విస్తీర్ణంతో ఉన్నట్లు హెచ్‌ఎండీఏ హద్దులతో సర్వే మ్యాపులో పొందుపర్చింది. అందులో కొంత మేర పట్టాభూమి ఉండగా, 18 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. సౌటకుంటలో పట్టా భూములున్న వారు సాగు మాత్రమే చేసుకోవాలి తప్ప..

అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని అతిక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో భారీ అక్రమ నిర్మాణాలను చేపట్టారు. అలాగే సౌటకుంటలో వరద కల్వలు సైతం గతంలో ఉండగా అవి నేడు కనుమరుగై పూర్తిగా కనిపించడం లేదు. వరద నీరు కల్వల నుంచి వెళ్లేందుకు నిర్మించిన కల్వర్టులను సైతం పూడ్చి వేశారు. 

ఎఫ్‌టీఎల్‌లో భారీ నిర్మాణాలు

గతంలో కుంట ఆయకట్టు చుట్టుపక్కల పొలాలకు సౌటకుంట నీటిద్వారా సాగుచేసేవారని స్థానికులు చెబుతున్నారు. కాలక్రమేణా వ్యవసాయ పనులు చేసేవారు తగ్గిపోవడం, ఆశించినస్థాయిలో రీతిలో వర్షాలు కురవకపోవడంతో ఆ పొలాలు పూర్తిగా బీళ్లుగా మారాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా మారి 1999 నుంచి లేఅవుట్లు చేశారు. ఇదే అదునుగా భావించిన రియల్ వ్యాపారులు సౌటకుంట ఎఫ్ టీఎల్‌మెల్లగా నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఈ ప్రాంతంలో ఇలాంటి నిర్మాణాలు చేయొద్దని నిబంధనలు ఉన్నప్పటికీ ఇవేమీ లెక్కచేయకుండా సౌటకుంట ఎఫ్‌టీఎల్‌ఏరియాలో భారీఎత్తున అక్రమ నిర్మాణాలు వెలిశాయి.

అధికారులూ.. చర్యలు తీసుకోండి..

సౌటకుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన భారీ అక్రమ నిర్మాణాలపై గతంలో సంబంధిత అధికారులు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. అధికారులు అలసత్వం వహించకుండా ఆ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకుని సౌటకుంటను రక్షించాలన్నారు.

 గంట అనుపమ లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్