17-10-2025 10:35:09 PM
మరిపెడ,(విజయక్రాంతి): పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగా వేయించుకోవాలని పశువైద్య అధికారి డాక్టర్ మనోహర్ కృష్ణ రైతులను కోరారు. జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమం కింద ప్రభుత్వం నెల రోజులపాటు ఉచిత గాలికుంటు టీకాల కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని అనేపురం, యల్లంపేట, భీమ్లా తండా, తనంచర్ల, మూలమర్రి తండా, ఎడిజర్ల గుర్రపు తండా,లలో మొత్తం 479 పశువులు 388 గేదెలు 91 కి టీకాలు వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలికుంటు ఒక అంటు వైరల్ వ్యాధి అని, దీని వల్ల పశువులకు తీవ్రమైన జ్వరం రావడమే కాకుండా పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది, తద్వారా రైతులు ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. మూడు నెలలు పైబడిన పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి, టీకా వేసిన ప్రతి పశువుకు గుర్తింపు చెవి పోగు వేసి, వాటి వివరాలతో పాటు రైతుల వివరాలను యాప్‌లో నమోదు చేయాలని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పశువులను వ్యాధి నుంచి రక్షించుకోవాలని ఆయన సూచించారు.