calender_icon.png 18 October, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలి

17-10-2025 10:18:57 PM

జిల్లా అదనపు కలెక్టర్ , ఇన్చార్జి జిల్లా విద్యాధికారి దీపక్ తివారి

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల హాజరుపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఇన్చార్జి జిల్లా విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో కెరమెరి, జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్, తిర్యాణి జిల్లా పరిషత్, ఆశ్రమ పాఠశాలలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఇన్చార్జి జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల సముదాయం పరిధిలోని పాఠశాలలలో విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రతి పాఠశాలను సందర్శించి విద్యార్థుల గైర్హాజరుపై ఉపాధ్యాయులతో సమీక్షించాలని, కొన్ని పాఠశాలలలో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా నమోదవుతున్నందున ఆయా పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి క్రమం తప్పకుండా విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందిస్తూ వార్షిక పరీక్షలకు ఇప్పటినుండి సన్నద్ధం చేయాలని తెలిపారు.

సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఆశ్రమ పాఠశాలలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని విద్యార్థులకు అందించాలని తెలిపారు. విద్యారంగంలో జిల్లాను ముందంజలో ఉంచేందుకు ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.