25-11-2025 08:12:23 PM
శివ్వంపేట,(విజయక్రాంతి): శివ్వంపేట మండలంలోని శ్రీ బగలాముఖి అమ్మవారి శక్తిపీఠం యాగశాల ప్రారంభోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన రాకను పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన ర్యాలీ అనూహ్యంగా వర్గపోరుకు వేదికైంది. మండల కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు, రెండు గ్రూపులు ఒకరినొకరు ఎదిరించాయి.
ర్యాలీలో ఇరు వర్గాల మధ్య తోపులాటలు చోటుచేసుకోవడంతో వాతావరణం క్షణాల్లో ఆందోళనకరంగా మారింది. కొందరు కార్యకర్తలు పరస్పరం దాడులకు కూడా పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని శాంతింపజేశారు కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత రాజకీయాలు, గ్రూపు పోరు మళ్లీ బయటపడటంతో స్థానిక రాజకీయాల్లో కొత్త చర్చలకు తావు ఇచ్చాయి.