12-08-2025 12:52:11 AM
-ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీల్లో సోలార్ ప్లాంట్లు
-ఇరిగేషన్ ప్రాజెక్టుల్లోనూ ప్లోటింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు
-డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
చేవెళ్ల, ఆగస్టు 11: రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, యూనివర్సీటీలోనూ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నామని, ఈ మేరకు ప్రతిపాదనలకు పంపాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. సోమవారం మొయినాబాద్ పరిధిలోని చిలుకూరు, నాగిరెడ్డిగూడ , నవాబ్పేట మండలంలోని నారేగూడెంలో రూ.20 కోట్లతో మంజూరైన మూడు 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు.
అనంతరం మొయినాబాద్ మండల రైతులకు 80 (25 KV) ట్రాన్స్ ఫార్మర్లు, లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం 2047 నాటికి ఉండే డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తితో పాటు స్టోరేజీ, క్వాలిటీ విషయంలోనూ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేవలం ధర్మల్ పవరే కాకుండా గ్రీన్ ఎనర్జీని అభివృద్ధి చేస్తున్నామని, ఈ మేరకు దేవాదాయ, ఇరిగేషన్ తదితర ప్రభుత్వ భూముల్లో సోలార్ ప్లాంట్లు పెట్టనున్నామన్నారు. అలాగే మీడియం, భారీ నీటి పారుదల ప్రాజెక్టుల్లో ప్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ప్రతిపాదనల కోసం ఇప్పటికే ఇరిగేషన్ అధికారులకు లేఖ రాశామని చెప్పారు. ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ద్వారా గిరిజనులకు ఉచిత సోలార్ పంపుసెట్లు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రతి కార్మికుడికి రూ.కోటి ఇన్సూరెన్స్
ప్రస్తుతం రాష్ట్రంలో 2 వేల మెగావాట్ల డిమాండ్ పెరిగినా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం లైన్ మెన్ నుంచి ఎస్‌ఈ వరకు అందరూ కష్టపడుతున్నారని, ప్రతి విద్యుత్ కార్మికుడిని రూ.కోటికి తగ్గకుండా ఇన్సూరెన్స్ చేయిస్తామని ప్రకటించారు. అంతేకాదు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ 132 కేవీ సబ్ స్టేషన్ శాంక్షన్ చేయాలని కోరారని, విద్యుత్ అధికారులు డిమాండ్ ను అంచనా వేసి ప్రతిపాదనలు ఇస్తే వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇక రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపినీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని, రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలు ఉంటే, 95 లక్షల కుటుంబాలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పేదలకు ఇండ్లకు 200 యూనిట్లు, 29 లక్షల వ్యవసాయం పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నమని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, రాష్ట్రంలో ఈ పథకం కోసం రూ. 22,500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, కలెక్టర్ నారాయణ రెడ్డి, సీఎండీ ముషరఫ్ అలీ ఫరూకీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, ఆర్డీవో చంద్రకళ, మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్ , సీనియర్ నేత జనార్ధన్ రెడ్డి, టీపీసీసీ మెంబర్ షాబాద్ దర్శన్, ముడిమ్యాల పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి, డీఈ రమేశ్ చంద్ర, ఏడీ రమేశ్, ఏఈ బనోత్ హము తదితరులు పాల్గొన్నారు.