10-11-2025 07:55:25 PM
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు వాయినాలు..
బెల్లంపల్లి (విజయక్రాంతి): కార్తీకమాసం మూడవ సోమవారాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి మండలంలోని కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం 6 గంటల నుండి దేవస్థానంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలతో పాటు పూజా కార్యక్రమాలు చేపట్టారు. బెల్లంపల్లి భజన బృందం సభ్యులు రాజరాజేశ్వరుని సంకీర్తనలతో భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన నెలకొల్పారు. ఉదయం నుండే మహిళలు కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి నందీశ్వరుని వద్ద కార్తీక దీపాలను వెలిగించారు.
గర్భగుడిలోని శివలింగాన్ని దర్శించుకుని పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తాంజనేయ స్వామి, నాగులమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కార్తీక వేడుకల్లో పాల్గొన్న మహిళలకు పసుపు కుంకుమ, అమ్మవారి గాజులు, నూతన వస్త్రాలు వాయినంగా ఇచ్చారు. అశేషంగా తరలివచ్చిన భక్తులకు రాజరాజేశ్వర అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో ఈవో జి .బాపిరెడ్డి, అన్నదాన ట్రస్ట్ చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, క్లర్క్ భానుతో పాటు అన్నదాన ట్రస్టు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.