12-01-2026 12:58:27 AM
ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి
10 ఎకరాలతో క్రీడల స్టేడియం మంజూరు
నడిచ్పల్లి, జనవరి 11(విజయక్రాంతి): సమయ పాలనతో క్రీడలు ఆడితే యువతి, యువకుల్లో మేధస్సు పెరిగి పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఎంతో దోహదం చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. డిచ్పల్లి మండలంలోని సిఎంసి మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో ఆర్.పి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, ఆటలు శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు, విజయం సాధించేందుకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రికెట్ ఆటలో గెలుపు-ఓటములు సహజమని, ఓడినవారు లోపాలు తెలుసుకుని మరింత కృషితో ముందుకు సాగాలని సూచించారు. గెలిచిన వారు కూడా మరిన్ని విజయాలు సాధించేలా మెలకువలు అలవర్చుకోవాలని అన్నారు.
మత్తుపదార్థాల నిర్మూలనపై రాష్ట్ర చర్యలు
యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈగిల్ టీమ్ ఏర్పాటు చేసిందని, యువత క్రీడల వైపు ఆసక్తి పెంచితే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవచ్చని చెప్పారు.
ఒలింపిక్స్ లక్ష్యం
స్కిల్ & స్పోరట్స్ యూనివర్సిటీలు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ఒలింపిక్స్లో తెలంగాణ యువత రాణించాలని స్కిల్ యూనివర్సిటీ, స్పోరట్స్ యూనివర్సిటీ స్థాపన చేశారని ఎమ్మెల్యే వివరించారు. చిన్న దేశాలు ఒలింపిక్స్లో గోల్ మెడల్స్ తెస్తుంటే మన రాష్ట్రం నుంచి కూడా ఒలింపిక్ లో ఆటగాళ్లు ఆడాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని తెలిపారు. ఇందుకోసం సీఎం కప్, ఇంటర్ జోన్ టోర్నమెంట్లు, పాఠశాలలుకాలేజీల్లో గేమ్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 10 ఎకరాల స్థలంలో క్రీడా స్టేడియం మంజూరు అయ్యిందని, రానున్న రోజుల్లో రూరల్ యువత రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేలా అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
హాస్పిటల్ మేనేజ్‌మెంట్ అభినందనలు
క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన ఆర్.పి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ను ఎమ్మెల్యే అభినందిస్తూ యువతను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచి క్రీడల వైపు మళ్లించడం గొప్ప సేవ అని కొనియాడారు. గెలిచిన జట్టుకు శుభాకాంక్షలు తెలి యజేసి, ఓడిన వారికి కూడా ప్రోత్సాహం తెలిపారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, గంగదాస్, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, పిసిసి కార్యదర్శి భాస్కర్ రెడ్డి, పోలసాని శ్రీనివాస్ శాంసన్, రామచందర్ గౌడ్, డిచ్పల్లి మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు వాసుబాబు, క్రీడాకారులు పాల్గొన్నారు.