20-11-2025 04:36:14 PM
నంగునూరు: సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి నంగునూరు మండలం నర్మెట్టలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నర్మెట్ట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ట్యాబ్ ఎంట్రీలలో జాప్యం జరగకుండా చూడాలని డీఎం సివిల్ సప్లైస్‌ను ఫోన్‌లో ఆదేశించారు. తేమశాతం రాగానే ఆలస్యం చేయకుండా ధాన్యాన్ని వెంటనే గన్నీలలో నింపి లోడింగ్ పూర్తి చేయాలని సెంటర్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నర్మెట్ట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి, మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వంటశాల సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుని, ఆహార పదార్థాల నాణ్యత మెరుగుపరచాలని సూచించారు.
ఎదిగే పిల్లలకు తప్పనిసరిగా పౌష్టికాహారం అందించాలని, ప్రతిరోజు నెయ్యి పెట్టాలని సూచిస్తూ, స్వయంగా విద్యార్థులకు నెయ్యి వడ్డించారు.260 మంది విద్యార్థులకు గాను 230 మంది హాజరు ప్రకారం వంట సరుకులు అందించినట్లు స్పెషల్ ఆఫీసర్ (ఎస్ఓ) కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కామన్ డైట్ మెనూను కచ్చితంగా పాటించాలని, కూరగాయలు దొరకట్లేదనే సాకులు చెప్పినా, విధుల్లో నిర్లక్ష్యం వహించినా ప్రిన్సిపాల్ నుండి వంట సిబ్బంది వరకు అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. పిల్లలకు తరచుగా హెల్త్ చెకప్ చేయాలని, ముఖ్యంగా హిమోగ్లోబిన్ శాతాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఏఎన్ఎంను కలెక్టర్ ఆదేశించారు.