20-11-2025 04:48:34 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ గ్రామంలోని ఎంపీ యూపీఎస్ పాఠశాలలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి డా. భాస్కర్ జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేష్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ బాలలకు నాలుగు ప్రధాన హక్కులు ఉన్నాయని వెల్లడించారు.
జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కు బాలలు తమ హక్కులను తెలుసుకొని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ, భవిష్యత్తులో ఉన్నత స్థానాలను సాధించాలని వారు సూచించారు. బాలల హక్కులకు భంగం కలిగితే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్లు సంప్రదించాలని సూచించారు అనంతరం పాఠశాల విద్యార్థులు , ఉపాధ్యాయులతో కలిసి బాలల హక్కుల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది బాల ప్రవీణ్ కుమార్, చంద్రశేఖర్, జమున, రవళి, వెంకటేశ్వర్లు, రాణి, రాజేశ్వరి ,పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.