7 March, 2026 | 11:30 AM

నేటి నుంచి శ్రీ సిద్ధరామేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

07-03-2026 12:00 AM

భిక్కనూరు, మార్చి 6 (విజయ క్రాంతి) : భిక్కనూరులోని దక్షిణ కాశీగా పేరుగాంచిన, ప్రసిద్ధ శ్రీ పార్వతీ సిద్ధరామేశ్వర స్వామి స్వయంభూలింగ మహాక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈనెల 11వ తేదీ వరకు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు. దక్షిణ భారతదేశంలోని ప్రాచీన శివక్షేత్రాలలో ఒకటైన ఈ దేవాలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలిచింది.

మహాక్షేత్ర మహత్యం..

స్థల పురాణం ప్రకారం శ్రీ సిద్ధగిరి, రామగిరి యోగిపుంగవుల తపస్సుతో ఈ క్షేత్రం వెలుగులోకి వచ్చిందని చెబుతారు. ఒక కపిల గోవు పుట్టపై పాలు ధారపోసిన దృశ్యాన్ని చూసిన యోగులు అక్కడ స్వయంభూ లింగం ఉన్నట్టు తెలుసుకొని ఆలయాన్ని నిర్మించినట్లు కథనం. ఈ క్షేత్రంలో బాణామతి, గ్రహపీడ వంటి సమస్యలు తొలగిపోతాయని, సంతానం లేని దంపతులు 40 రోజుల దీక్షతో స్వామిని ఆరాధిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

ఉత్సవ కార్యక్రమాలు..

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 7న పుణ్యాహవాచనం, అంకురార్పణ, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. మార్చి 8న అగ్ని ప్రతిష్ఠ, దేవతాహోమం, ధ్వజారోహణం నిర్వహించనున్నారు. మార్చి 9న మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం, అదే రోజు రాత్రి 12 గంటలకు విమాన రథోత్సవం భక్తి వైభవాలతో నిర్వహించబడుతుంది. మార్చి 10న అవభృథ స్నానం, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.

మార్చి 11న నాకబలి, పూర్ణాహుతి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేస్తారు.ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో అనేక అభివృద్ధి పనులు కూడా చేపట్టాలని ఆలయ అభివృద్ధి కమిటీ నిర్ణయించింది.

భక్తుల వసతి కోసం గదుల నిర్మాణం, నంది మండపం, గోపురం, ధ్యాన మందిరం వంటి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే దేవాలయం చుట్టూ షెడ్లు, హోమశాల సీసీ ఫ్లోరింగ్, అన్నదాన ప్రసాదశాల, స్వాగత తోరణం, కొత్త రథం వంటి అభివృద్ధి పనులు పూర్తి చేశారు. ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు  కోరారు.