calender_icon.png 20 November, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

20-11-2025 10:09:05 PM

ఎంపీ మల్లు రవి

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): విద్యలో రాణిస్తేనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గంగాపురం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రముఖ కవి అందెశ్రీకి శ్రద్ధాంజలి ఘటించారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ–గ్రంథాలయాలు విద్యార్థుల భవిష్యత్తుకు పునాది లాంటివి అన్నారు. డిజిటల్ లైబ్రరీలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాల్లో రాణించాలి. పదో తరగతి వరకు విద్యార్థులు మొబైళ్లకు దూరంగా ఉండాలని సూచించారు. 

జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని, త్వరలో కోటి రూపాయలతో డిజిటల్ లైబ్రరీ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి 200 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. చైర్మన్ గంగాపురం రాజేందర్ మాట్లాడుతూ కల్వకుర్తి కొత్త గ్రంథాలయ భవనానికి ₹1.50 కోట్లు, అచ్చంపేటకు ₹1 కోటి, ఉప్పునుంతలలో ఎమ్మెస్సార్ ప్రాజెక్ట్ కంపెనీ ద్వారా ₹25 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి త్వరలో కొత్త ఫర్నిచర్ అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి శాలువాలు కప్పి సత్కారం నిర్వహించారు. అనంతరం గ్రంథాలయ వారోత్సవాల నేపథ్యంలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్లు రమణారావు, మల్లేష్, అధికారులు శ్యాంసుందర్, శ్రీనివాస్ రెడ్డి, దివాకర్ రావు, గ్రంథాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.