సింగరేణిలో అత్యాధునిక సాంకేతికత
- బ్లాకుల అభివృద్ధి, గనుల్లో భద్రతే లక్ష్యం
- అమెరికాలో డిప్యూటీ సీఎం భట్టి బృందం పర్యటన
- కేటర్‌పిల్లర్, కొమాట్సు కేంద్రాల సందర్శన
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, జిమ్కో సీనియర్ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి బృందం అమెరికాలో పర్యటిస్తోంది. ఈ పర్యటన లో భాగంగా గురువారం బృందం సభ్యులు టెక్సాస్, అరిజోనా రాష్ట్రాల్లో ఉన్న ప్రఖ్యాత మైనింగ్ యం త్రాల తయారీ కేంద్రాలను సందర్శించారు.
అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సింగరేణికి తీసుకురావడం, తద్వారా గనుల్లో భద్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఈ పర్యటనకు శ్రీకారం చుట్టాయి. ముందుగా అరిజోనా రాష్ట్రం టక్సన్‌లోని కేటర్‌పిల్లర్ డెమానిస్ట్రేషన్ అండ్ లెర్నింగ్ సెంటర్‌ను డిప్యూటీ సీఎం బృందం సందర్శించింది.
అక్కడ స్వయంచాలిత (అటానమస్), రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేసే భారీ మైనింగ్ యంత్రాల పనితీరును ప్రత్యక్షంగా వీక్షించింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాల విడిభాగాలు, ఆపరేటర్ల శిక్షణా విధానాలు, ప్రమాద నివారణ భద్రతా వ్యవస్థల పనితీరుపై చర్చించారు. అనంతరం డల్లాస్ లాంగ్‌వ్యూలో ‘కొమాట్సు మైనింగ్ కార్పొరేషన్’ను సందర్శించారు. అక్కడి పనివిధానాన్ని పరిశీలించి ప్రతినిధులతో చర్చలు జరిపారు.
సాంకేతిక బదిలీ ఒప్పందాల ద్వారా భవిష్యత్తులో తెలంగాణలోనే సర్వీస్ యూనిట్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇటీవల సింగరేణి సంస్థ రెండు భారీ బొగ్గు బ్లాకులను దక్కించుకున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్, క్యాటర్‌పిల్లర్ ఇండియా ప్రతినిధి ఆర్‌కె మిశ్రా, డెన్నిస్ తదితరులు పాల్గొన్నారు.






