calender_icon.png 7 July, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాల నేపథ్యంలో అలెర్ట్‌గా ఉండండి

07-07-2025 01:20:53 AM

- అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో మందులు సిద్ధం

- వైద్యారోగ్య శాఖ అడ్వైజరీ విడుదల 

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): సోమవారం నుంచి ఈ నెల 9 వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆదివారం ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ పలు సలహాలు, సూచనలను జారీ చేసింది.

వర్షాల ప్రభావంతో నీరు, గాలి ద్వారా సంక్రమించే వ్యాధులకు అవకాశం ఉందని డీహెచ్ డా. రవీందర్ నాయక్  పేర్కొన్నారు. డెంగ్యూ, మలేరియా, చికున్ గన్యా నివారణ కోసం ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవాలని సూచించారు. రాత్రి వేళ ఇంటి తలుపులు, కిటికీలను మూసి వేయాలని, దోమ కాటుకు గురికాకుండా దోమ తెరలను వాడాలన్నారు.

ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. సెప్టిక్ ట్యాంక్‌లను దోమలు పెరగకుండా మెష్‌తో కప్పాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించి ఇంటి చుట్టూ నీటి నిల్వలను తొలగించాలన్నారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు ఫిల్టర్ చేసిన, కాచి వడబోసిన నీటిని తాగాలన్నారు.

జ్వరం, దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, శరీర నొప్పులు వంటి ఫ్లూ లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ సేవలను సంప్రదించాలని కోరారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినంత మందులు, సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.