01-10-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
స్థానిక సంస్థల ఎన్నికలపై మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం, సెప్టెంబర్-30: ఖమ్మం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలను రెండు విడతలలో, గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ షెడ్యూల్ విడుదల చేసిం దని, అదే ప్రకారం ఖమ్మం జిల్లాలో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున గ్రామీణ ప్రాంతాల్లో ఎం.సి.సి. కోడ్ అమలు కావడం జరుగుతుందని అన్నారు.
ఖమ్మం జిల్లాలో మొత్తం 20 మండలాల్లో 571 గ్రామ పంచాయతీలు, 5214 వార్డులు, 99 షెడ్యూల్ ప్రాంతం గ్రామ పంచాయతీలు, 461 నాన్ షెడ్యూల్ ప్రాంతం గ్రామ పంచాయతీలు, జిల్లా వ్యాప్తంగా 5214 గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్లు, 737 పోలింగ్ లోకేషన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎం.సి.సి. కోడ్ అమలులో భాగంగా 20 ఎఫ్. ఎస్.టి, 16 ఎస్.ఎస్.టి. టీములను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో 20 జెడ్పిటిసి స్థానాలకు 4 ఎస్టీ, 4 ఎస్సీ, 8 బీసీ, 4 అన్ రిజరవ్డ్ క్యాటగిరి కేటాయించామని, 283 ఎంపీటీసీ స్థానాల్లో 50 ఎస్టీ, 58 ఎస్సీ, 103 బీసి, 72 అన్ రిజరవ్డ్ క్యాటగిరి కేటాయించామని, 20 ఎంపీపీ స్థానాల్లో 5 ఎస్టీ , 4 ఎస్సీ, 8 బీసి, 3 అన్ రిజరవ్డ్, 571 గ్రామ పంచాయతీ స్థానాలకు 171 ఎస్టీ , 110 ఎస్సి, 190 బీసీ, 100 అన్ రిజరవ్డ్ క్యాటగిరిలో కేటాయించామని అన్నారు.
జులై 10 వరకు నమోదు అయిన ఓటర్ల వివరాల ప్రకారం పురుషులు 3,88,243, మహిళలు 4,14,425, ఇతరులు 22 మంది కలిపి మొత్తం 8,02,690 మంది ఓటు వేసే అవకాశం ఉందని, ప్రతి విడతలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ కు అనుగుణంగా నామినేషన్, పరిశీలన, పో లింగ్ తేదీలు నిర్ణయించామని అన్నారు.
పోలింగ్ కేంద్రాలను పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన వసతులు ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నారని, పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా విధులు కేటాయిస్తామని అన్నారు. మండల కేంద్రాలలో నామినేషన్ స్వీకరణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
స్క్రూటినీ చేసిన తర్వాత అప్పీల్ కు అవకాశం కల్పించి డిస్పోజల్ కొరకు ఒక రోజు కేటాయించడం జరిగిందని, సోమ వారం నుండి ఎం.సి.సి. అమలులోకి రావడం జరిగిందని, ఎన్నికల నియమావళి తప్పకుండా పాటించాలని, పోలీస్ బందోబస్తు కూడా తగినంతగా ఉన్నదని, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అనం తరం మీడియా ప్రతినిధులు అడిగిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు.ఈ మీడియా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.