calender_icon.png 1 October, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు పెచ్చుమీరిపోయాయి

01-10-2025 12:00:00 AM

రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి

ఖమ్మం, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): కాంగ్రెస్ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు పెచ్చుమీరిపోయాయని, ప్రధాన ప్రతిపక్షానికి చెందిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు వేధింపులకు గురి చేయడంతో బానోత్ రవి ఆత్మహత్యకు యత్నించడం జరిగిందన్నారు.

ఎంపీ రవిచంద్ర బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, బానోత్ చంద్రావతి, జెడ్పీ మాజీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితర నాయకులతో కలిసి ఖమ్మం తెలంగాణ భవన్ లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు అభివృద్ధిపై దృష్టి సారించకుండా ప్రధాన పక్షానికి చెందిన నాయకులను రాజకీయంగా అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని ఎంపీ రవిచంద్ర ఆవేదన చెందారు.

ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే, వార్తలు రాసే వారిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడం రాష్ట్రమంతటా కూడా నిత్యకృత్యంగా మారిందని ఎంపీ రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల దురాగతాలను వ్యతిరేకిస్తూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని బీఆర్‌ఎస్ శ్రేణుల నుంచి వత్తిళ్లు ఉన్నా కూడా శాంతియుత పరిస్థితులకు భంగం కలుగొద్దనే ఉద్ధేశంతో ఆగిపోయామని ఎంపీ రవిచంద్ర చెప్పారు.

బీఆర్‌ఎస్ నాయకుడు రవిని వేధిస్తున్న వారిపై పోలీసులు ఇప్పటి దాక కేసు నమోదు చేయకపోవడం బాధాకరమన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు పోలీసులను ప్రయోగించి బీఆర్‌ఎస్ వారిపై ఎన్ని అణచివేత చర్యలకు పాల్పడినా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ విజయఢంకా మోగించడం తథ్యమని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు.

సమావేశం అనంతరం రవిచంద్ర,మధు, వెంకటవీరయ్య, ఉపేందర్ రెడ్డి, చంద్రావతి,కమల్ రాజ్,ఉప్పల వెంకట రమణ,ఖమర్,బెల్లం వేణు తదితర నాయకులు నగర పోలీసు కమిషనర్ సునీల్ దత్ ను కలిసి రవిని వేధింపులకు గురి చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి,చట్ట ప్రకారం శిక్షించాలంటూ వినతిపత్రం అందజేశారు.