calender_icon.png 18 October, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగర ప్రధాన సమస్యల పరిష్కారానికి చర్యలు-

18-10-2025 12:00:00 AM

-రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు 

-నాణ్యతతో వసతి గృహ నిర్మాణ పనులు పూర్తి చేయాలి

-నగరంలో త్రాగునీటి పనులకు 220 కోట్లు మంజూరు

-ప్రజల అంగీకారంతోనే రోడ్డు వెడల్పు పనులు

-ముస్తఫానగర్ బీసీ బాలుర వసతి గృహ నిర్మాణ పనులకు  శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల

ఖమ్మం టౌన్, అక్టోబర్ 17 (విజయ క్రాంతి): ఖమ్మం నగరంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మంత్రి, శుక్రవారం స్థానిక ముస్తఫా నగర్  లో 3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీసీ బాలుర వసతి గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ముస్తాఫా నగర్ లో బీసి వసతి గృహం కోసం నూతన భవన నిర్మాణానికి మూడు కోట్లు మంజూరు చేశామని అన్నారు.

ఖమ్మం నగరంలో పాతబడి కూలిపోయే స్థితిలో ఉన్న 3 సంక్షేమ హాస్టల్స్ నిర్మాణానికి ప్రభుత్వం మొత్తం 9 కోట్లు మంజూరు చేసిందని అన్నారు.  ఈ హాస్టల్స్ నిర్మాణ పనులు పూర్తి నాణ్యతతో చేపట్టాలని, భవిష్యత్తులో పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజల అంగీకారం ఉంటే బోనకల్ రోడ్డు వెడల్పు చేస్తామని అన్నారు. రోడ్డు వెడల్పు జరిగితేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. ప్రజలు ప్లాస్టిక్, చెత్తను రోడ్లు, మురికి కాల్వలలో వేయవద్దని  సూచించారు.

రిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోకపోతే రోగాల బారిన పడి డబ్బులు అనవసరంగా ఆసుపత్రిలో ఖర్చు అవుతాయని అన్నారు. ఖమ్మం నగరంలో ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని త్వరలో త్రాగునీటి సౌకర్యం కల్పన కోసం మరో 220 కోట్లు మంజూరు చేస్తామని అన్నారు. రాబోయే వేసవి కాలంలో ఎక్కడ ఖమ్మంలో మంచినీటి సమస్య ఉండటానికి వీలు లేదని, ప్రతి ఒక్కరికి శుద్ధమైన త్రాగు నీరు అందాలని అన్నారు. నగరంలో రోడ్డు వెడల్పు పనులకు ప్రజలు సహకరించాలని, పావలా నష్టపోతే ప్రజలకు రూపాయి వరకు పరిహారం అందిస్తూ ఆదుకుంటున్నామని మంత్రి తెలిపారు.

రైల్వే స్టేషన్ రోడ్డు వెడల్పు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. కార్పొరేటర్లు తమ డివిజన్ పరిధిలో వెడల్పు చేయాల్సిన రోడ్ల వివరాలు అందించాలని అన్నారు. భగవంతుని దయ, ప్రజల ఆశీర్వాదంతో ఖమ్మం జిల్లా పరిధిలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో తనకు భాగస్వామ్యం వహించే అవకాశం లభించిందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఖమ్మం నగరం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. 

 రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, స్థానిక కార్పొరేటర్ రోజ్ లీన, కార్పొరేటర్లు, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఇఇ లు రంజిత్, కృష్ణలాల్, మునిసిపల్ కార్పొరేషన్ సహాయ కమీషనర్ అనిల్ కుమార్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.