18-10-2025 05:42:17 PM
న్యూఢిల్లీ: సైన్యం అమ్ములపొదిలో మరికొన్ని బ్రహ్మోస్ క్షిపణులు చేరాయి. భారతదేశ రక్షణ తయారీ డ్రైవ్‌లో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తూ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం లక్నోలోని బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీలో ఉత్పత్తి చేయబడిన తొలి విడత బ్రహ్మోస్ క్షిపణులను జెండా ఊపి ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో కీలకమైన ఈ సౌకర్యం మేలో వర్చువల్ ప్రారంభోత్సవం తర్వాత కేవలం ఐదు నెలలకే కార్యకలాపాలు ప్రారంభించింది.
ఏరోస్పేస్ యూనిట్ లో తయారైన తొలి విడత బ్రహ్మోస్ క్షిపణులను సైన్యానికి అప్పగించిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాకిస్తాన్ భూభాగంలోని ప్రతి అంగుళం ఇప్పుడు బ్రహ్మోస్ చేతికి అందేంత దూరంలో ఉందని, ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనన్నారు. పాక్ దుస్సాహసానికి తెగబడితే ఉహించని ప్రతిస్పందన ఉంటుందని, యూపీ రక్షణ పరిశ్రమ కారిడార్ కు మైలురాయిగా నిలుస్తుందని రాజ్ నాథ్ అన్నారు. రక్షణరంగంలో స్వావలంబనకు కొత్త శక్తినిస్తుందని, బ్రహ్మోస్‌ను కేవలం క్షిపణి కంటే ఎక్కువ అని, దీనిని భారతదేశం పెరుగుతున్న స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు చిహ్నం" అని అభివర్ణించారు.
రూ.380 కోట్లతో లక్నోలోని 200 ఎకరాలో నిర్మించిన ఈ కేంద్రం ఏటా దాదాపు 100 క్షిపణి వ్యవస్థలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ వ్యూహాత్మక ఆస్తి మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి కూడా ఉత్ప్రేరకం అని సింగ్ స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక ఏడాది నుండి ఈ యూనిట్ రూ.3,000 కోట్ల టర్నోవర్‌ను ఉత్పత్తి చేస్తుందని, జీఎస్టీలో దాదాపు రూ.500 కోట్లకు దోహదపడుతుందని భావించారు.