11-10-2025 02:06:22 AM
హుజూర్ నగర్, అక్టోబర్ 10: బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తే బీసీల అభివృద్ధికి అడుగులు వెస్తుందని సిపిఐ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని గవర్నర్ వెంటనే ఆ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో అన్ని పార్టీలు ఆమోదించిన బిల్లుపై బయట రాజకీయాలు చేయడం తగదన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు స్పష్టమైన విధానంతో బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపి ప్రజల అభిప్రాయాలను గౌరవించాలన్నారు.
బీసీ కుల గణన ప్రకారం వారికి ఉన్న ప్రాతినిధ్యం ప్రకారం హక్కులు కలిగి ఉండడం సహజం అన్నారు. స్వాతంత్య్రం అనంతరం బీసీ కుల గణన జరిపి రాష్ర్ట ప్రభుత్వం 42% రిజర్వేషన్లు కల్పించడానికి స్వాగతిస్తున్నామని దానికి అన్ని అడ్డంకులు తొలగి దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ర్టంలో అమలు కావడం జరగాలని చారిత్రకాంశం లాగా మిగిలిపోవాలని ఆకాంక్షించారు.
సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సిపిఐ రాష్ర్ట కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు, సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడుయల్లావుల రమేష్,రైతు సంఘం పట్టణ అధ్యక్షుడు జక్కుల రమేష్ పాల్గొన్నారు.