11-10-2025 02:04:27 AM
వలిగొండ, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ర్ట గవర్నర్ బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం వలిగొండ మండల కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకోకు సిపిఎం, సిపిఐ బిఎస్పి, టిడిపి, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర చేస్తున్నాయని అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తించేలా పార్లమెంటులో చట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు దక్కేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించకుండా బిల్లును ఆమోదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.