calender_icon.png 24 November, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వచ్ఛత దిశగా అడుగులు

19-11-2025 12:00:00 AM

మరుగుదొడ్లు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతూ, వ్యర్థాలను సమర్థవంతంగా తొలగించడం ద్వారా ప్రజలను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నేడు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పురస్కరించుకొని భారత్‌లో కనీస మరుగుదొడ్ల సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం. గ్రామీణ పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం లక్ష్యంగా.. భారత్‌లో మొదట సెంట్రల్ రూరల్ శానిటేషన్ ప్రోగ్రామ్ 1986లో ప్రారంభమైంది.

ఈ కార్యక్రమం అధిక సబ్సిడీతో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చింది, కానీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఆ తర్వాత 1999లో తక్కువ ఖర్చుతో కూడిన పారిశుధ్య విధానం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. దీనినే సంపూర్ణ పారిశుధ్యమంటారు. మెరుగైన పరిశుభ్రత, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిశుభ్రతతో పాటు 2010 నాటికి బహిరంగ మలవిసర్జనను నిర్మూలించి సంపూర్ణ పారిశుధ్యం సాధించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం విజయవంతమవడంతో భారత ప్రభుత్వం అక్టోబర్ 2003 లో నిర్మల్ గ్రామ పురస్కార్‌ను ప్రవేశపెట్టింది.

దీనివల్ల పారిశుధ్య స్థితిగతుల్లో గణనీయ మార్పు లు వచ్చాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో మరుగుదొడ్ల కవరేజీ 21 శాతంగా ఉంటే.. 2011 నాటికి ఇది 32.7 శాతానికి పెరిగింది. అయితే ‘నిర్మల్ భారత్ అభియాన్’ గ్రామీణ పారిశుధ్య కార్యక్రమానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో నిర్మల్ భారత్ అభియాన్‌ను అప్పటి మోదీ ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదంతో 2014 సెప్టెంబర్ 24న ‘స్వచ్ఛ భారత్ అభియాన్’గా పునర్వ్యవస్థీకరించారు. మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

ఈ మిషన్ కింద ఐదేళ్లలో 10 కోట్లకు పైగా వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి. 2019 నాటికి, ఈ కార్యక్రమం 100 శాతం పారిశుధ్య కవరేజీని సాధించింది. 2014 నుంచి భారత ప్రభుత్వం బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) లక్ష్యాలను చేరుకోవడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. 2020 జనవరి నాటికి 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 706 జిల్లాలు 6,03,175 గ్రామాలు ఓడీఎఫ్ హోదాను పొందాయి. జాతీయ పారిశుద్ధ్య కవరేజీ 2014 అక్టోబర్ 2న ఉన్న 38.7 శాతం నుంచి 2018 ఆగస్టు నాటికి 90 శాతానికి పెరిగింది.

స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించిన తర్వాత, గ్రామీణ భారతంలో కనీసం 1,80,000 డయేరియా మరణాలు నివారించబడ్డాయని డబ్ల్యూహెచ్‌వో తన నివేదికలో పేర్కొంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌వో) 2018లో నిర్వహించిన సర్వే ప్రకారం, 2018 నాటికి 71 శాతం గ్రామీణ కుటుంబాలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశ 2019లో ప్రారంభమైంది. వ్యర్థాల నిర్వహణతో పాటు, అన్ని గ్రామాలను ఓడీఎఫ్ నుంచి ఓడీఎఫ్ ప్లస్ మోడల్‌గా మార్చడం, 2024 నాటికి సంపూర్ణ స్వచ్ఛతను సాధించడం దీని లక్ష్యం. ఇది ఆరంభం మాత్రమే. భారత్ ఒక పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు అడుగులు వేయాలంటే ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం.

 డీజే మోహనరావు